పాలిటిక్స్‌పై ఎఫెక్ట్ చూపేలా ‘సినిమా’ చూపిస్తా మామ
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ సినిమాలకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ సినిమాలకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆయా పార్టీల లైన్‌కు తగినట్లుగా డైరెక్టర్లు పలు స్టోరీలను ప్లాన్ చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ తమ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ప్రజల మెదళ్లలో తాము అనుకున్నది బలంగా నాటాలని చూస్తున్నారు. కొంతమంది డైరెక్టర్లు పొలిటికల్ ఎజెండాతో సినిమాలు తీస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలే సంచనాలు అయ్యేవి. ఇప్పుడు రాజకీయ సంచలనాలు సినిమాలుగా మారుతున్నాయి.
ఇలాంటి కథలు ఎన్నికల సమయంలో ఓటర్లను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఒక పార్టీని దెబ్బతీయాలన్నా, ఒక పార్టీకి మైలేజ్ రావాలన్నా వినోదంతో పాటు తమ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను విజువల్ పద్ధతిన సినిమాలతో వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. గత ఎన్నికల్లో పలు సినిమాలు ఆయా రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ వైఎస్సార్ సీపీకి కలిసి వచ్చింది. అలాగే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమా టీడీపీని తీవ్రంగా డ్యామేజ్ చేసింది. ఈ సినిమా కూడా వైఎఎస్సార్ సీపీకి ప్లస్ అయింది.
ఏపీపై వర్మ ‘వ్యూహం’..
ఇప్పుడు అదే పంథా మరోసారి రిపీట్ కానుంది. రాంగోపాల్ వర్మ మరోసారి కొత్త ఆలోచనకు తెరలేపారు. ‘వ్యూహం’ అనే సినిమాను తెరకెక్కించున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను గురువారం బయటపెట్టారు. వ్యూహం పేరుతో తన వ్యూహాలకు పదును పెట్టబోతున్నారు. అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగిన పోరాటంగా సినిమాను చిత్రీకరించనున్నారు. వ్యూహం సినిమాను రెండు పార్ట్‌లుగా తీయబోతున్నారు. ఏపీ ఎన్నికలు వచ్చే వరకు రెండు సినిమాలు జనం మెదళ్లలో బలంగా ఎక్కేలా ప్లాన్ చేస్తున్నారు. మహానేత వైఎస్సార్ మరణం నుంచి జగన్ జైలుకు వెళ్లే వరకు మొదటి పార్ట్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక సీఎంగా బాధ్యతల నిర్వహణ వరకు రెండో పార్ట్‌లో చూపించనున్నట్లు టాక్. జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస సుబ్రహ్మణ్యం నటిస్తున్నారు.
తెలంగాణలోనూ...
ఇక తెలంగాణలోనూ ఇలాంటి ట్రెండ్ మొదలుకానుంది. ఇప్పటికే కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ అనే సినిమాలు ఓటర్లపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. ఈ సినిమాలు బీజేపీకి బాగా ప్లస్ అయ్యాయి. కాగా తెలంగాణలోనూ రజాకార్, రజాకార్ ఫైల్స్ అనే రెండు సినిమాలను ఎన్నికల నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాల షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఎన్నికల సమయానికి రిలీజ్ చేస్తే బీజేపీకి మరింత ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ సైతం దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌కు మారడంతో తెలంగాణ ఎమోషన్, సెంటిమెంట్‌ను గులాబీ పార్టీ కోల్పోయింది.
ఈ సెంటిమెంట్, ఎమోషన్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. ఇందుకోసం నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడిన కష్టాలను ఇప్పటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే బండి సంజయ్ సూచనలతో ‘రజాకార్’ అనే సినిమా సెట్స్ పై ఉంది. బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి సారథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. కాగా ‘రజాకార్ ఫైల్స్’ పేరిట రాజమౌళి తండ్రి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పొలిటికల్ సినిమా ట్రెండ్‌తో పలు పార్టీలకు ప్లస్ అయితే.. వాటి ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు ఖాయమనేది అర్థమవుతోంది. ఎన్నికల సమయంలో సినిమా ఎవరు ఎవరికి చూపిస్తారనేది వేచి చూడాల్సిందే.