CI Nageshwar Reddy: ఇదేం పని సార్.. ఆస్తి కోసం తల్లితండ్రులకు సీఐ కర్కశత్వం

ఆస్తి కోసం తల్లితండ్రులకు ఓ సీఐ వేధించడం కలకలం రేపింది.

Update: 2024-08-06 11:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆయనో పోలీసు అధికారి. సమాజంలో జరిగే అన్యాయాన్ని అరికట్టి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. అలాంటి ఆఫీసర్ అదనపు ఆస్తి కోసం ఆయన ఏకంగా కని పెంచిన కన్నతల్లిదండ్రులపైనే కర్కశంగా వ్యవహరించాడు. వృధాప్యంలో ఉన్న తంల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఆయన వేధింపులు తాళలేకపోయిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి నుంచి నుంచి కాపాడాలని రాష్ట్ర డీజీపీని ఆశ్రయించారు. ఈ అమానవీయఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాధ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు యాదయ్య కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే రఘునాథ్ రెడ్డికి స్వగ్రామంలో 30 ఎకరాల 23 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచితే చెరో 15 ఎకరాలు రావాల్సి ఉంది. అయితే తండ్రి రఘునాథ్ రెడ్డి 15 ఎకరాలు పెద్ద కుమారుడికి, 11 ఎకరాలు చిన్న కుమారుడికి మిగత భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నాడు. కానీ సీఐ నాగేశ్వర్ రెడ్డి మాత్రం తనకు మరో 5 ఎకరాలు ఇవ్వాల్సిందే అని హింసించడం మొదలు పెట్టాడు. ఇది న్యాయం కాదని చెప్పేందుకు ప్రయత్నిస్తే తనపై దాడికి దిగుతున్నాడని తల్లి మీడియా ఎదుట కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ క్రమంలో తమపై భౌతికంగా దాడులు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల చిన్న కుమారుడు యాదయ్య ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నాడు. దీంతో తమ పెద్ద కొడుకు నుంచి తమకు ప్రాణహాని ఉందని అతని బారి నుంచి రక్షణ కల్పించాలంటూ తాజాగా ఆ వృద్ధ దంపతులు రాష్ట్ర డీజీపీని ఆశ్రయించారు. అన్యాయాలను ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన పోలీసు అధికారే ఆస్తి కోసం తల్లిదండ్రులను హింసించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

Tags:    

Similar News