జనంలోకి TRS యువనేత.. సామాజిక సేవలో తనదైన ముద్ర

నీలం మధు ముదిరాజ్. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పటాన్ చెరు అసెంబ్లీ సెగ్నెంట్‌లో ఇప్పుడీపేరే ట్రెండింగ్. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా నీలం మధు గురించే చర్చ.

Update: 2022-09-08 03:06 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: నీలం మధు ముదిరాజ్. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పటాన్ చెరు అసెంబ్లీ సెగ్నెంట్‌లో ఇప్పుడీపేరే ట్రెండింగ్. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా నీలం మధు గురించే చర్చ. గ్రేట్ మధు అని కొందరంటే.. మంచోడు మధుబాయ్ అని మరికొందరు. ఆయన నుంచి సాయం పొందిన వారు చేతులు జోడించి దండం పెడుతున్నారు. ఇంటివద్ద ఎప్పుడు చూసినా సన్నిహితులు, యువకులు, నియోజకవర్గంలోని ప్రజలతో సందడి వాతావరణం. సన్మానాలు, అభినందనలు, మధన్నకు జై అంటూ నినాదాలు. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు జనంతోనే మమేకం. అధికార టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, పటాన్ చెరు మండలం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా అందరి మన్నన్నలు పొందుతున్నారు. మరో వైపు పార్టీ అధిష్టాన పెద్దల నుంచి ప్రశ్నంసలు అందుకుంటున్నారు. పార్టీ అభివృద్ది కోసం పనిచేసే ఇలాంటి సర్పంచ్‌లు అవసరమని అధిష్టాన పెద్దలు మెచ్చుకుంటున్నారు. తక్కువ సమయంలో ట్రెండింగ్ అయిన మధు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం...

ఆదర్శ కుటుంబం నుంచి రాజకీయంలోకి..

నీలం మధు ముదిరాజ్‌ది ఆదర్శ కుటుంబం. తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. చిట్కుల్ గ్రామానికి చెందిన నీలం నిర్మల్ ముదిరాజ్ రెడ్డి కమ్మూనిటీకి చెందిన రాధను పెళ్లి చేసుకున్నాడు. వారి కుమారుడే మధు. నీలం రాధ గ్రామ వార్డు సభ్యురాలిగా, ఎంపీటీసీగా పనిచేశారు. గ్రామంలో మంచి పేరున్న వీరి కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు మధును గ్రామస్తులు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. మొదట మధు వార్డు సభ్యుడుగా, ఉప సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. మధు గ్రామాభివృద్ధిలో విశేషంగా కృషి చేస్తున్నారు. గ్రామంలో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు ఆదర్శ సర్పంచ్‌గా గుర్తింపు పొందారు. గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పంచాయతీ కావడంతో చిట్కుల్ వేగంగా అభివృద్ది చెందుతుండగా అందులో మధు పాత్ర మరవలేనిదని చెప్పుకోవచ్చు.

24 గంటల వ్యవధిలో తల్లిదండ్రుల మరణం

ఎంతో ఆదర్శంగా జీవనం సాగిస్తున్న మధు కుటుంబాన్ని మాయదారి కరోనా చిన్నాభిన్నం చేసింది. 24 గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరు దుర్మరణం చెందడం మధును తీవ్ర దుఖసాగరంలో ముంచింది. గతేడాది మే 5న తల్లి రాధ కరోనాతో అకాలమరణం చెందారు. అప్పటికే అనారోగ్యంగా ఉన్న తండ్రి నిర్మల్ తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. మనసులోనే కుమిలిపోయిన నిర్మల్ మరుసటి రోజు మే 6న కన్నుమూశారు. నిర్మల్‌కు కరోనా లేకపోయినప్పటికీ భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. వీరిద్దరి మరణంతో చిట్కుల్ గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదర్శ దంపతుల మరణాన్ని తలచుకుని ఇప్పటికీ గ్రామస్తులు తీవ్ర ఆవేధన చెందుతుంటారు. నిర్మల్, రాధ ఇద్దరు కూడా సేవా దృక్పథం ఉన్న వారు. అపదలో ఉన్న వారికి ఉన్నదాంట్లో తోచిన సాయం అందించేవారు. కొడుకు మధుకు కూడా సాయం అందించాలని సూచించేవారు.

తల్లిదండ్రులు చూపిన సేవా బాటలో ఎన్ఎంఆర్

తల్లిదండ్రుల మరణాన్ని కొడుకు నీలం మధు జీర్ణించుకోలేకపోయారు. బాధను దిగమింగుకుని ఎన్ఎంఆర్ (నిర్మల్, మధు, రాధ) పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా సర్పంచ్ మధు సామాజిక సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాడు. ఇందులో భాగంగానే మొదట తన తల్లి మరణం తరువాత రైతు బీమా కింద వచ్చిన రూ.5 లక్షలతో పాటు తండ్రి మరణంతో వచ్చిన ఇన్యూరెన్స్, ఇతర నిధులతో కలిపి గ్రామంలో ఐదు షటర్లు నిర్మిస్తున్నారు. వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కాకుండా యువతకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. వైద్యం కోసం బాధపడుతూ తన వద్దకు వస్తున్న నిరుపేదలకు తోచిన సాయం అందిస్తున్నారు. మొదట చిట్కుల్ గ్రామంతో మొదలైన మధు ఎన్ఎంఆర్ సేవా కార్యక్రమాలు పటాన్ చెరు నియోజకవర్గం మొత్తం విస్తరిస్తున్నాయి. చిట్కుల్ లోని తన నివాసం వద్దకు రోజు వందలాది మంది యువకులు వస్తుంటారు. నియోజకర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, ఉమ్మడి జిల్లాలోని ముదిరాజ్ కులస్తులు, వస్తుండడంతో సందడి నెలకొంటున్నది. పటాన్ చెరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలకు విరాళాలు అందిస్తున్నారు.

పార్టీ అధిష్టానం నుంచి ప్రశంసలు

ఓ వైపు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందుతున్న మధు మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్దల ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తుంటారు. పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అధిష్టానం దష్టిని మధు ఆకట్టుకున్నారు. ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్ రావు పుట్టిన రోజును పురష్కరించుకుని చిట్కుల్ గ్రామంలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన 30 మంది వరకు తల్లుల పేరున రూ. 5 వేలు డిపాజిట్ చేయించారు. మున్సిపల్ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పటాన్ చెరు నియోజకవర్గంలోని 73 మంది పోటో గ్రాఫర్ల కుటుంబాలకు ఆరోగ్యబీమా కార్డులు అందించారు. పార్టీ పరంగా, తన సంస్థ ద్వారా విస్ర్తతంగా చేస్తున్న సేవా కార్యక్రమాలతో మధు అందరి మన్నన్నలు పొందుతున్నారు. పార్టీ కోసం పనిచేసే నీలం మధు లాంటివారు ఎంతో అవసరమని మంత్రులు, అధిష్టాన పెద్దలు ప్రత్యేకంగా ప్రశంసిస్తుంటారు. మధు సేవా కార్యక్రమాలను శ్రీ త్రిదండి చిన జియర్ స్వామి కూడా మొచ్చుకున్నారు. యువతకు మీ లాంటి వారు ఆదర్శమని ఆశీస్సులు అందించారు. అందరి మన్నన్నలు అందుకుంటూ రాజకీయంగా, సామాజికంగా ముందుకు సాగుతున్న నీలం మధు మరింత గొప్పగా ఎదగాలని చిట్కుల్ గ్రామస్తులతో పాటు నియోజకవర్గ ప్రజలు మనసారా కోరుకుంటున్నారు.

Also Read : 'ఆ TRS ఎమ్మెల్యేకు ప్రజలంతా కర్రుకాల్చి వాతపెట్టాలే'


Tags:    

Similar News