సంస్థాగత మార్పులపై పోటాపోటీ వ్యూహాలు.. రెండు జాతీయ పార్టీల్లో ‘చీఫ్’ సస్పెన్స్..!

సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల మధ్య అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ ఉంటుంది.

Update: 2024-06-26 02:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల మధ్య అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ ఉంటుంది. ఆయా పార్టీలు ఎవరిని ఖరారు చేస్తాయోనని ఎదురుచూస్తూ ఉంటాయి. దానికి తగినట్టుగా దీటైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తుంటాయి. కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రస్థాయిలో నాయకత్వాన్ని మార్చడంపై ఆసక్తి నెలకొన్నది. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కొత్త చీఫ్ రావాల్సిన అవసరం ఏర్పడింది. బీజేపీలో సైతం ప్రస్తుతం స్టేట్ చీఫ్‌గా ఉన్న కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కావడంతో కొత్త నాయకుడు రావడం అనివార్యమైంది. దీంతో ఏ పార్టీకి ఎవరు స్టేట్ చీఫ్ అవుతారనేది ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠగా మారడం ఒక అంశమైతే..బీజేపీకి కొత్త చీఫ్‌గా ఎవరొస్తారని కాంగ్రెస్... కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌గా ఎవరొస్తారని బీజేపీ..పరస్పరం దృష్టి పెట్టిన వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నది.

రెండు పార్టీలకూ బీసీ లీడర్లే చీఫ్‌లు!

బీసీ సామాజికవర్గానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తున్నందున స్టేట్ పార్టీ చీఫ్‌గా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే ఉంటారనే జనరల్ టాక్ పార్టీలో వినిపిస్తున్నది. అదే సమయంలో కాంగ్రెస్‌లో సైతం సీఎంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఉన్నందున పీసీసీ చీఫ్‌గా బీసీ సామాజికవర్గానికి చెందినవారు ఉండాలని ఏఐసీసీపై రాష్ట్ర నాయకుల ఒత్తిడి పెరుగుతున్నది. రెండు పార్టీలకూ బీసీ నాయకులే స్టేట్ చీఫ్ అవుతారనే అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో ఎవరు వస్తే ఆ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై ఎలాంటి ఎఫెక్టు పడుతుంది, పార్టీ బలోపేతానికి ఎలాంటి విధానాన్ని అవలంభించాల్సి ఉంటుంది, ఆ పార్టీపై పైచేయి సాధించడానికి ఎలాంటి వ్యూహాన్ని రూపొందించుకోవాలి..ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సొంత పార్టీ గురించే కాక ప్రత్యర్థి పార్టీ కదలికలపైనా ప్రత్యేక ఫోకస్ సరికొత్త పరిణామం.

ప్రత్యర్థి కదలికలపై ఆసక్తి

ప్రత్యర్థి పార్టీ నాయకత్వానికి దీటుగా సొంత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం, పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయిలో పటిష్ఠం చేయడం, ప్రజలకు దగ్గర కావడానికి వీలుగా నిర్ణయాలు తీసుకోవడం, పైచేయి సాధించేలా వ్యూహాలు రూపొందించుకోవడం అన్ని పార్టీల్లో సహజంగా ఉండేది. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఆ పార్టీకి కొత్త సారథి ఎవరు..ఎవరు వచ్చే అవకాశమున్నది..దాంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..ఇలాంటి అంశాలపై ఆ రెండు పార్టీల నేతల్లో కొత్త ఆసక్తి కనిపిస్తున్నది. ప్రత్యర్థి పార్టీకి నాయకత్వం ఎవరో తేలిన తర్వాత వ్యూహాలు రూపొందించుకునే విధానానికి బదులుగా ఇప్పుడు మాత్రం ముందు నుంచే ప్రత్యర్థి పార్టీలోని కదలికలు, పరిణామాలను గమనించడం మొదలైంది. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆందోళన, అలజడి లేదని, ఈసారి మాత్రమే భిన్నంగా కనిపిస్తుందనే చర్చలు వినిపిస్తున్నాయి.

నిర్ణయం మార్పు వ్యూహాలకూ కసరత్తు!

ఫలానా వ్యక్తి చీఫ్‌గా వస్తే సొంత పార్టీ ఓటు బ్యాంకుకు ఎఫెక్టు పడుతుందా?.. ఆ కమ్యూనిటీ ఓటు బ్యాంకులో చీలిక వస్తుందా?..దాన్ని నివారించుకోడానికి ఏం చేయాలి?.. ఇలాంటి మాటలూ వినిపిస్తున్నాయి. ఎవరు వచ్చినా పర్వాలేదుగానీ ఫలానా వ్యక్తి మాత్రం రావొద్దు..వస్తే రకరకాలుగా గ్రామ స్థాయిలో కార్యకర్తలను కులం, సీనియారిటీ తదితరాలతో డిస్టర్బ్ చేస్తారన్నదే ఈ ఆందోళనకు కారణం. ఒక దశలో ఫలానా వ్యక్తికి స్టేట్ చీఫ్ పోస్టు ఖాయమనే సంకేతం రాగానే ఆ పార్టీ లీడర్ల మధ్యనే భిన్నాభిప్రాయాలు తలెత్తేలా చక్రం తిప్పడం, హైకమాండ్ నోటీసుకు వెళ్లేలా ఆ పార్టీ లీడర్ల నుంచే అసంతృప్తి రేగేలా చేయడం..ఇలాంటి వ్యూహాలకు కూడా కసరత్తు జరుగుతున్నది. సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి పెరిగితే నిర్ణయంలో మార్పు ఉంటుందనేది ఈ వ్యూహం వెనక ఉన్న ఉద్దేశం.

ఏ పార్టీకి ముందుగా చీఫ్ వస్తారో?

కాంగ్రెస్, బీజేపీలకు స్టేట్ చీఫ్‌లుగా కొత్త లీడర్లను హైకమాండ్ ప్రకటించే టైమ్ దగ్గర పడుతుండటంతో ఇలాంటి పరిణామాలు నెలకొన్నాయి. ఒకవేళ రాకూడదనుకున్న వ్యక్తే ఆ పార్టీకి చీఫ్‌గా వచ్చినట్టయితే పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించలేని విధంగా రకరకాల సమస్యలతో ఒత్తిడి పెంచేలా, నిత్యం ఇరుకున పెట్టేలా విమర్శలు, ఆరోపణలతో సంస్థాగతంగా నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించే పరిస్థితి లేకుండా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలూ లేకపోలేదు. ఏ పార్టీకి ముందుగా కొత్త చీఫ్ వస్తారో అనే ఉత్కంఠ రెండు పార్టీల లీడర్లలో నెలకొన్నది. 


Similar News