REVANTH REDDY: ఉద్దేశపూర్వకంగానే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
నైపుణ్యం లేకపోవడంతోనే నిరుద్యోగం పట్టిపీడుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: నైపుణ్యం లేకపోవడంతోనే నిరుద్యోగం పట్టిపీడుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని ఎద్దేవా చేశారు. యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా రెండు వేల మందికి శిక్షణ, యంగ్ ఇండియా వర్సిటీలో ఏటా 20 వేల మందికి శిక్షణా ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో అన్ని వర్సిటీలను నూతన వీసీలను నియమిస్తామని అన్నారు. వర్సిటీల్లో అన్ని ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని వెల్లడించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ది కోసమే నిరుద్యోగులను వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగ అర్హత పరీక్షలను వాయిదా వేస్తే నిరుద్యోగులకే నష్టం, నిరుద్యోగులు చెప్పింది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
మా మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ రైతులు, విద్యార్థులే అని గొంతెత్తి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో పదేళ్లు కళ్లారా చూశామన్నారు. విద్యార్థుల ఉద్యమం వల్లే రాష్ట్ర సాధన జరిగిందని మరోసారి గుర్తు చేశారు. నిరుద్యోగుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే మా లక్ష్యమని సవాల్ విసిరారు. 90 రోజుల్లో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని చెప్పారు.