సెన్సేషనల్‌గా చెన్నూరు పాలిటిక్స్..! పట్టుబడిన నగదు వివేక్‌దేనా?
రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నడుమ బిగ్ ఫైట్ నడుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నడుమ బిగ్ ఫైట్ నడుస్తోంది. ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో చెన్నూరు రాజకీయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్ మరోసారి గెలవాలని ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ తరపున గడ్డం వివేక్ బరిలోకి దిగారు. అయితే నామినేషన్ల రోజు నుంచే బాల్క సుమన్ వర్సెస్ వివేక్ మధ్య రాజకీయం వేడెక్కగా తాజాగా చెన్నూరులో ‘మనీ’ పాలిటిక్స్ రచ్చ రేపుతున్నాయి.
చెన్నూరులో గెలిచేందుకు వివేక్ డబ్బులు పంచుతున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని బాల్క సుమన్ ఈసీకి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే చెన్నూరుకు తరలిస్తున్న డబ్బు సంచులతో ఇద్దరు వ్యక్తులు పట్టబడటం కలకలం రేపుతున్నది. ఈ డబ్బు వివేక్‌కు సంబంధించినదే అనే ప్రచారం సోషల్ మీడియాలో గుప్పుమంటుండటంతో ఈ వ్యవహారం దుమారంగా మారింది.
లీడర్లను కొనుగోలు చేసేందుకు డబ్బు తరలింపు!
తాజాగా చెన్నూరు నియోజకవర్గానికి తరలిస్తున్న డబ్బును పట్టుకున్నారు. పట్టుబడిన వారు వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిషోర్, వెలుగు పత్రిక మార్కెటింగ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్‌లని ప్రచారం జరుగుతున్నది. వీరి వద్ద రూ. 50 లక్షల నగదు, రెండు మొబైల్స్, ఒక బైక్‌ను ఉప్పల్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్నది. వివేక్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలో లీడర్లను కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును తరలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
వివేక్‌పై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు..
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ పేరు ఖరారు అయిన నాటి నుంచి బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ స్వయంగా సీఈవోను కలిసి ఫిర్యాదు చేసి సంచలన ఆరోపణలు గుప్పించారు. చెన్నూరులో వివేక్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని, వివేక్ కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి సోమవారం కోట్లాది రుపాయలు బదిలీ చేశారని ఆరోపించారు. ఆ కంపెనీ రామగుండంలో వివేక్ ఇంటి చిరునామాపైనే ఉందని ఈ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరినట్లు బాల్కా సుమన్ మీడియాకు వివరించారు.
అలాగే వివేక్ కుటుంబ సభ్యులు, కంపెనీలు, బంధువుల బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టాలని కోరినట్లు తెలిపారు. వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బులు పంపుతున్నారని ఈ వ్యవహారంపై త్వరలోనే ఈడీ, ఐటీ డిపార్ట్ మెంట్లకు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. ఈక్రమంలో తాజాగా ఇద్దురు వ్యక్తులు డబ్బు సంచులతో పట్టుబడటం వారు వివేక్‌కు చెందిన మనుషులే అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.