రాష్ట్రంలో మారిన పొలిటికల్ సీన్.. కమలదళం అస్త్రసన్యాసం?
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి ఆయన స్థానంలో కిషన్‌రెడ్డిని నియమించడంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంజయ్‌ను తొలగించడంతో కిందిస్థాయి లీడర్లు, కేడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
ఒకవైపు బీఆర్ఎస్‌ను బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కామెంట్స్ చేసిన సమయంలో ఈ మార్పులు జరగడం గమనార్హం. కేసీఆర్‌ను సూటిగా విమర్శించే సంజయ్‌ను తొలగించడమంటే పార్టీ దూకుడుకు కళ్లెం వేయడమేననే మాటలూ వినిపిస్తున్నాయి. మితవాదిగా ముద్రపడిన కిషన్‌రెడ్డి.. కేసీఆర్‌తో సాఫ్ట్‌గా వ్యవహరిస్తారనే అభిప్రాయం ఉన్నది. కమలదళం ఇక అస్త్రసన్యాసం చేసినట్లేననే వాదనలూ తెరపైకి వస్తున్నాయి.
పరస్పర సహకారం?
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీకి కీలకంగా ఉండే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కమలం పార్టీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయని, ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడితే ఆ కూటమిలో బీఆర్ఎస్ భాగస్వామిగా చేరి కేంద్ర కేబినెట్‌లో పాలుపంచుకుంటుందనే వాదనా వినిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ సహకారం లభిస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీకి గులాబీ పార్టీ అనుకూలంగా ఉంటుందనేలా ఆ రెండు పార్టీల మధ్య పరస్పర ఒప్పందంలో జరిగిందని, అందులో భాగంగానే బండి సంజయ్‌ను చీఫ్ పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పజెప్పారన్న వాదన తెరపైకి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఫైట్ నామినల్‌గానే ఉండొచ్చని, కీలకమైన పోరు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌ను తొలగించడమంటే ఆ నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమేనంటూ ఆ పార్టీ నేత విజయ రామారావు మూడు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఆయనను తప్పిస్తే చాలా మంది నేతలు పార్టీకి దూరమవుతారని చెప్పారు. ఇక పార్టీలో చేరికలే ఉండవని, అన్నీ ఔట్-గోయింగ్ మాత్రమేనని కామెంట్ చేశారు.
కేసీఆర్‌ను గద్దె దించడం, బీజేపీని అధికారంలోకి తేవడానికి బండి సంజయ్ లాంటి నేత అవసరమని ఆ పార్టీ నేతల్లో చాలా మందికి ఏకాభిప్రాయం ఉన్నది. సంజయ్‌తో విభేదిస్తూ పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లి అగ్రనేతలను కలవడాన్ని తప్పుపడుతూ జితేందర్‌రెడ్డి తన నివాసంలో వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విఠల్ తదితర పలువురితో లంచ్ మీటింగ్ ఏర్పాటుచేశారు.
బండి సంజయ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరోవైపు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిసినప్పుడు బండి సంజయ్ వ్యవహారశైలిపై సూటిగానే అభిప్రాయాలను చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్‌ను ఓడించడం కష్టమేనని కూడా వారు చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ లీడర్‌షిప్‌ను మార్చకపోతే తమ దారి తాము చూసుకుంటామన్న అభిప్రాయాన్నీ మొహం మీదనే వారు నడ్డాకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
పార్టీ చీఫ్‌ను మార్చితే ఆ అవకాశం తనకే ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. దాదాపు రెండు వారాలుగా రాష్ట్ర నేతల మధ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భేదాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా రెండు రోజుల టూర్‌లో భాగంగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత బీజేపీలో అంతర్గత వ్యవహారాలు వేగంగా మారడం మొదలైంది.
నిమిషాల వ్యవధిలోనే లుకలుకలు..
బండి సంజయ్‌ను చీఫ్ పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డిని ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే రాష్ట్ర యూనిట్‌లో లుకలుకలు మరోసారి బయటకు వచ్చాయి. బీజేపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ అనే కొత్త మెకానిజాన్ని సృష్టించి దానికి ఈటల రాజేందర్‌ను చైర్మన్‌గా నియమించడంపై స్టేట్ సీనియర్ లీడర్లలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
“మాకేం తక్కువ?.. మేం సీనియర్లం కాదా?.. మాకు ఆ అవకాశం ఇవ్వొచ్చు గదా...” అంటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇంకోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు మంతనాలు మొదలుపెట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఆయనతో టచ్‌లో ఉన్నారు. తాజా మార్పుతో రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదనే మాటలు బీజేపీ నుంచి వినిపిస్తున్నాయి.
రాష్ట్ర నాయకత్వ మార్పుతో బీజేపీ వీక్ అవుతుందని, అది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ స్ట్రైట్ ఫైట్‌గా మారుతుందని కాంగ్రెస్ సహా పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయనడానికి కిషన్‌రెడ్డి నియామకమే నిదర్శనమనే కామెంట్స్ సరేసరి. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ పరస్పర అవగాహనతోనే ఉంటాయని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అది నామమాత్రంగానే ఉంటుందని, దాదాపుగా కమలం పార్టీ అస్త్ర సన్యాసం చేసి బీఆర్ఎస్‌కు ఊతమిచ్చి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఈ వ్యూహ రచన జరిగిందని హస్తం నేతల ఆరోపణ. రాహుల్‌గాంధీ చేసిన కామెంట్స్‌కు బలం చేకూర్చేలా తాజా మార్పులు జరిగాయన్నది వారి వాదన.
Also Read: కమలం శ్రేణులు గప్‌చుప్.. బండి రాజీనామాపై నోకామెంట్స్..