తెలంగాణ నేతలకు చంద్రబాబు పిలుపు.. త్వరలోనే టీ-టీడీపీకి నూతన అధ్యక్షుడు..?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే శుక్రవారం భేటీకి తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు టీటీడీపీ నేతలు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయిన బాబు.. రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవం కోసం పని చేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు.
కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామాతో కొంత కాలంగా ఖాళీగా ఉన్న టీటీడీపీ అధ్యక్షుడి నియామకంపైన ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కొత్త అధ్యక్షుడి నియామకంపై నేతల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 4 తర్వాత తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం ఉండనున్నట్లు సమాచారం. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేయొద్దన్న అధిష్టాన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
కాసాని రాజీనామా చేసినప్పటీ నుండి టీటీడీపీ చీఫ్ పోస్ట్ ఖాళీగానే ఉంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గా్లో ఇప్పటికీ కేడర్ కలిగి ఉన్న టీడీపీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్‌లోనూ బరిలోకి దిగలేదు. పార్టీ అధ్యక్షుడు లేకపోవడం, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన బాబు.. ఇన్ని రోజులు ఏపీ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉండటంతో ఎలక్షన్స్ ముగిసిన వెంటనే తెలంగాణపై ఫోకస్ పెట్టారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, పార్టీ నూతన చీఫ్ నియామంపైన దృష్టి సారించారు. దీంతో తెలంగాణ టీడీపీ నెక్ట్స్ చీఫ్ ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.