పొత్తుపై స్పందించని బీజేపీ అధిష్ఠానం.. చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
కమలనాథుల అండతోనే రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నట్లు ఇప్పటిదాకా టీడీపీ, జనసేన భావించాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఢిల్లీ పెద్దలు జగన్‌ను కట్టడి చేస్తారని ఆశించారు.
బీజేపీతో కలిస్తే సీఎం జగన్‌ను కట్టడి చేస్తారని చంద్రబాబు, పవన్ భావించారు. ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాషాయ పార్టీతో పొత్తుకు సిద్ధమని లీకులిచ్చినా ఢిల్లీ పెద్దల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. రాష్ట్రంలో జగన్ దూకుడుకు కళ్లెం వేస్తున్న దాఖలాల్లేవు. అలాంటప్పుడు రాష్ట్రానికి దగా చేసిన పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీతో చెలిమి వల్ల ఒరిగేదేంటి? అనేది తెలుగు తమ్ముళ్లలో మెదలాడుతున్న ప్రశ్న. సోమ, మంగళవారాల్లో చంద్రబాబు, పవన్ సీట్ల పంపకంపై ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. అది వాస్తవం కాదని తేలింది. ఇంతకీ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో: కమలనాథుల అండతోనే రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నట్లు ఇప్పటిదాకా టీడీపీ, జనసేన భావించాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఢిల్లీ పెద్దలు జగన్‌ను కట్టడి చేస్తారని ఆశించారు. ఆచరణలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. జగన్, కాషాయ నేతల మధ్య సంబంధాలు సజీవంగానే ఉన్నాయి. వైసీపీ మీద కత్తి దూసేంతగా బీజేపీ అధిష్టానం వ్యవహరించడానికి ఇష్టపడడం లేదు. అవ్వా కావాలి.. బువ్వా కావాలన్నట్లు ఎన్నికలనంతరం వైసీపీ ఎంపీల మద్దతు కూడా అవసరమని కాషాయ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు పొత్తు పెట్టుకొని ప్రయోజనమేంటనేది టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.
స్పందించని బీజేపీ అధిష్ఠానం
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ అక్రమాలను అడ్డుకోలేక టీడీపీ చేతులెత్తేసింది. అప్పుడు వైసీపీ, బీజేపీ మాత్రమే పోటీలో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయనివ్వడం లేదని గగ్గోలు పెట్టారు. అయినా అధిష్టానం స్పందించలేదు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలే స్వయంగా నకిలీ ఓటర్లను పట్టుకొని అధికారులకు అప్పగించారు. సాక్ష్యాధారాలతో సహా అందించారు. నాడు ఢిల్లీ పెద్దలు కిక్కురుమన్లేదు. స్థానిక నేతలకన్నా తమకు జగనే ఎక్కువన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నా వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
సీట్ల సర్దుబాటుతో తంటాలు
మరోవైపు జనసేనతో సీట్ల సర్దుబాటు తలబొప్పి కట్టిస్తోంది. ఆ పార్టీకి సీట్లు కేటాయించిన చోట్ల పార్టీ నేతలను బుజ్జగించి ఒప్పించడం ఓ కొలిక్కి రాలేదు. దీనికి అదనంగా బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వాలంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీని కాపాడుకోవడం అంత తేలిక్కాదు. టీడీపీ ఓట్లు బీజేపీకి బదిలీ అవుతాయన్న గ్యారెంటీ కూడా కనిపించడం లేదు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా టీడీపీ రిస్క్ తీసుకొని బీజేపీతో కలిసినా ఆమేరకు జగన్విషయంలో ఢిల్లీ పెద్దలు మెతక వైఖరి అవలంబిస్తే రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుందని తమ్ముళ్లు మదనపడుతున్నారు. ఇప్పటికైనా అన్ని వైపుల నుంచి ఆలోచించి బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు తగు నిర్ణయం తీసుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.