తెలంగాణ టీడీపీ లీడర్లకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

సీనియర్ అంటే కుదరదు.. ప్రజాధరణ కలిగి ఉండాలి.. బలమైన నాయకుడు కావాలి వారికే పార్టీలో పెద్దపీట అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు స్పష్టం చేశారు.

Update: 2024-08-25 14:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీనియర్ అంటే కుదరదు.. ప్రజాధరణ కలిగి ఉండాలి.. బలమైన నాయకుడు కావాలి వారికే పార్టీలో పెద్దపీట అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాధరణ ఉన్న నాయకుడే పార్టీకి అవసరం అన్నారు. టీ.టీడీపీ కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని సీనియర్ నేతలతో ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గంటకు పైగా సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ ఆన్ లైన్ సభ్యత్వ నమోదు త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మ్యాన్ వల్‌గా సైతం చేయవచ్చని సూచించారు. సభ్యత్వ నమోదుపైనే లీడర్‌కు ప్రజల్లోని ఆదరణ స్పష్టమవుతుందన్నారు. అడహక్ కమిటీ సభ్యులే ఒక్కొజిల్లాను పర్యవేక్షిస్తారని వారు జిల్లా అడహక్ కమిటీ వేసి నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించి సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తారన్నారు. సోషల్ మీడియా కమిటీని సైతం బలోపేతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

నేతల పనితీరును బట్టి పార్టీ పదవులు అప్పగిస్తామని, జిల్లా కమిటీలు వేసిన తర్వాతనే చివరగా జిల్లా కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై త్వరలోనే స్పష్టత ఇస్తానన్నారు. పార్టీకి పునర్ వైభవమే లక్ష్యమని, అందుకు అందరూ సమిష్టిగా కృషిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతమే లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 15 అసెంబ్లీ స్థానాల్లో విజయం, మరో 17 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచామని, 32 నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ ఉద్యమ సమయంలోనే బలంగా ఉందని నిరూపించిందన్నారు. ఇప్పటికీ గ్రామస్థాయి నుంచి కేడర్ ఉందని, నేతలు పార్టీ మారడంతో కొంత స్తబ్దత ఉందని, దానిని తొలగించేందుకు ఇతర పార్టీల నుంచి ఎవరొచ్చినా స్వాగతించాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి అయిన తరువాతనే కమిటీలు అని తెలిపారు. తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన వారందరిని ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

కొత్త నాయకత్వం తయారు చేసుకోవాలని.. యువకులను ప్రోత్సహించాలని నేతలకు సూచించారు. తెలుగు వారందరూ 45 ఏళ్ల నుంచి తనను గౌరవిస్తున్నారన్నారు. తెలుగువారు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. యువ రక్తంతో తెలంగాణలో ముందుకు వెళ్తామన్నారు. తనకు రెండు భాద్యతలు ఉన్నాయని, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి.... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు వేసిన వారి కోసం కష్ట పడాలన్నారు. పదిపదిహేను రోజులకొకసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తానని వెల్లడించారు. సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే ప్రసూన, అశోక్, అనూప్, లత, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ నేతలపై ఆగ్రహం

పార్టీ సీనియర్ నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ పదవులు ఉన్నప్పటికీ ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్టీఆర్ భవన్ చుట్టూ తిరిగితే పార్టీ బలోపేతం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎవరెవరూ ఏం చేస్తున్నారో తనకు తెలుసునని, ఆఫీసుకు వచ్చిపోతే పార్టీ పటిష్టం అవుతుందా? అని నిలదీశారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, తాను సీనియర్ ను.. తాను చెప్పిందే వినాలనే ధోరణిని కొంతమంది మార్చుకోవాలని పరోక్షంగా చురకలంటించారు. పార్టీ కోసం పనిచేసేవారికి, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులకే పార్టీ పదవులు అని స్పష్టం చేసినట్లు సమాచారం.


Similar News