తెలంగాణలో దూకుడు పెంచిన టీడీపీ.. మొదటి రెండు సీట్లు కేటాయించిన చంద్రబాబు!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. 'ఇంటింటికీ తెలుగుదేశం' కిట్లను పార్టీ శ్రేణులకు చంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 41 ఏళ్లుగా తెలుగువారి కోసమే పనిచేస్తోన్న ఏకైక పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని, యువత, మహిళలకు టీడీపీ మాత్రమే పెద్దపీట వేసిందని తెలిపారు. సమిష్టిగా కృషిచేసి తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
దేశంలో అసలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ అని అన్నారు. హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కూడా టీడీపీదే అని అన్నారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీడీపీ మొదటి సీటును నాయీ బ్రాహ్మణులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రెండో సీటును రజకులకు ప్రకటిస్తూ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు అధికారం దక్కని వర్గాలకు అధికారం హస్తగతం చేయడమే తెలుగుదేశం లక్ష్యమని అన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడమే ఆ మహనీయుడు ఎన్టీఆర్‌కు మనం అందించే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని పిలుపిచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వడం భారతదేశానికే గర్వకారణమని, ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న తెలుగువారి డిమాండ్ నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్‌లోనే ఘనంగా నిర్వహిస్తున్నామని, దానిని విజయవంతం చేయాలని చంద్రబాబు కోరారు.