Chada Venkat Reddy : సీఎం కేసీఆర్‌కు CPI నేత చాడ వెంకటరెడ్డి బహిరంగ లేఖ

గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు.

Update: 2023-07-12 13:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా నేటికి గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోవడంతో ఉద్యోగులలో అసంతృప్తులు పెరిగాయని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామపంచాయతీలలో స్వీపర్లు, పంప్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రిషీయన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్‌ కలెక్టర్స్‌, నర్సరీలు, వైకుంఠధామాలు తదితర పద్దతులలో దాదాపు 50,000 మంది ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో వీరు పనులు చేస్తున్నారని.. తమ ప్రాణాలను పణంగా పెట్టి శుభ్రం చేసి ప్రజలను ప్రాణాలను కాపాడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల క్రమబద్దీకరణ లేకపోవడం, పనికి గుర్తింపు ఇవ్వకపోడం, కనీస వేతనం అమలు చేయకపోవడం, పీఎఫ్‌, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా కల్పించడం లేదని వివరించారు.

జీవో నెంబర్‌ 51తో మల్టీపర్పస్‌ విధానాన్ని ప్రవేశపెట్టి, ఉద్యోగులు అన్ని రకాల పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, దానితో నైపుణ్యం లేని పనులు చేయించడంతో అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాత పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, ట్రైజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 19,500 ఇవ్వాలని, జీవో 51ని రద్దు చేసి మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు వంటి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News