సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో త్వరలో సెంట్రలైజ్డ్ క్లూస్ టీం: CP స్టీఫెన్రవీంద్ర
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో త్వరలోనే సెంట్రలైజ్డ్ క్లూస్ టీం కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో త్వరలోనే సెంట్రలైజ్డ్ క్లూస్ టీం కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నేర ప్రదేశాల నుంచి ఆధారాల సేకరణలో నాణ్యతను మరింత మెరుగుపరచటం కోసం క్లూస్, వేలిముద్రల యూనిట్లను ఇప్పటికే పటిష్టం చేసినట్టు చెప్పారు. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం, డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగెన్వర్, ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్, హైదరాబాద్ క్లూస్ టీం హెచ్వోడీ వెంకన్నతో కలిసి తన కార్యాలయంలో ఫింగర్‌ప్రింట్ యూనిట్స్, క్లూస్‌టీం సిబ్బందితో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఇప్పటివరకు మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లలో ఫింగర్‌ప్రింట్, క్లూస్‌టీంలు పని చేస్తున్నట్టు చెప్పారు. వీటికి అదనంగా కొత్తగా ఏర్పాటైన రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్లలో కూడా ఈ టీములను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
నేరం జరిగినపుడు దోషులకు శిక్షలు పడేలా చూడటంలో సాక్ష్యాలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ క్రమంలో వీలైనంత వేగంగా నేర స్థలానికి చేరుకుని కీలకమైన ఆధారాలను సేకరించాలని సూచించారు. హైదరాబాద్క్లూస్టీం హెడ్వెంకన్న వర్క్మానిటరింగ్, క్వాలిటీ ఎన్సూరింగ్, అకౌంటబిలిటీ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. నేర స్థలం నుంచి ఆధారాలను సేకరించటంలో నూతన సాంకేతిక పద్దతులను అవలంభించాలని చెప్పారు. ఫలితంగా సంక్లిష్టమైన కేసుల్లో సైతం మిస్టరీని తొందరగా ఛేదింవచ్చన్నారు. తద్వారా కేసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా కేసుల ఛేధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి కమిషనర్స్టీఫెన్రవీంద్ర రివార్డులు అందచేశారు. సమావేశంలో అన్ని డివిజన్ల ఏసీపీలు, ఫింగర్‌ప్రింట్, క్లూస్‌టీం సిబ్బంది పాల్గొన్నారు.