Amit Shah: భారీ వరదలు.. తెలంగాణ విషయంలో అమిత్ షా కీలక నిర్ణయం!
కిషన్ రెడ్డి, బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : భారీవర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టం వాటిల్లింది. పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించగా అక్కడక్కడ ప్రాణనష్టం సైతం సంభవించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వరదల అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వెంటనే ఏరియల్ సర్వే చేయించాలని కోరారు. కేంద్రమంత్రుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన షా త్వరలోనే కేంద్ర ఉన్నతాధికారుల బృందం ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయంలో త్వరలోనే కేంద్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
ప్రధాని పర్యటించాలని సీఎం డిమాండ్..
కాగా భారీ వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5,438 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం తక్షణం ఆర్థిక సాయం చేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందం ద్వారా ఏరియల్ సర్వేకు సానుకూలత వ్యక్తం చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది.
ఎన్‌డీఆర్ఎఫ్ నిధులపై ఉత్తర్వులు..
తెలంగాణలో ఎన్‌డీఆర్ఎఫ్ నిధుల వినియోగం, మంజూరు విషయంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ విజ్ఞప్తిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. షా ఆదేశాలతో కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం రాష్ట్రం వద్ద ప్రస్తుతం రూ. 1,345 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొన్నది. జాతీయ విపత్తుల నిధికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను విడుదల చేస్తోందని వెల్లడించింది. రాష్ట్రం వద్ద ఉన్న ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోవాలని సూచించింది. నిధుల వాడకంపై రాష్ట్రం యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోవడం వల్లే ఈ ఏడాది జూన్‌లో రావాల్సిన రూ. 208.40 కోట్లను విడుదల చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నది.