ఆ ప్రాంతాల్లో ఇది మరింత కీలకం: కిషన్ రెడ్డి

గనుల తవ్వకాలు జరగుతున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నీటి వనరులను కాపాడుకోవడం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-08-01 16:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గనుల తవ్వకాలు జరగుతున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నీటి వనరులను కాపాడుకోవడం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో శాస్త్రి భవన్2లో గురువారం వేలంలో బొగ్గు గనులు దక్కించుకున్న వారికి ఆయన సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం గనుల పీఎస్‌యూల కోసం గైడ్ లైన్స్ ఫర్ రిజువెనేషన్ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ బాడీస్ ఇన్ కోల్ అండ్ లిగ్నయింట్ మైనింగ్ రీజియన్స్ పేరిట విధివిధానాలను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బొగ్గు, లిగ్నైట్ గనుల వద్ద జలవనరులను గుర్తించడం, వాటిని పర్యావరణానుకూలంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వేలంలో బొగ్గు గనులు దక్కించుకున్న వారికి పలు సూచనలు చేశారు.

గనుల నీటిని వివిధ రకాలుగా వినియోగించుకోవచ్చని, పారిశ్రామిక అవసరాలకు, భూగర్భజలాల వృద్ధికి, హైటెక్ పంటల ఉత్పత్తికి, చేపల ఉత్పత్తికి ఇలా.. చాలా రకాలుగా గనుల నీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. గనుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో నీటి వనరులను కాపాడుకోవడం అత్యంత అవసరమని, ఇందుకోసం బొగ్గు, లిగ్నైట్ గనుల ప్రభుత్వ రంగ సంస్థలు చొరవ తీసుకోవడాన్ని కిషన్ రెడ్డి అభినందించారు. అనంతరం, బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో.. పది వ్యూహాత్మకంగా కీలకమైన గనులకు వెస్టింగ్ ఆర్డర్స్‌ను కేంద్రమంత్రి అందజేశారు. ఈ పది గనుల ద్వారా దేశ విద్యుత్ భద్రత, పారిశ్రామికాభివృద్ధికి బాటలు పడనున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ పది గనుల్లో దాదాపుగా 2395 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, వీటి ద్వారా.. ఏడాదికి రూ.166.36 కోట్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉండగా.. రూ.150 కోట్ల మూలధన పెట్టుబడులను ఈ గనులు ఆకర్శించనున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలమందికి ఉపాధి లభించనుందని కిషన్ రెడ్డి తెలిపారు. బొగ్గు ఉత్పత్తిని పెంచి.. దిగుమతులు తగ్గించే దిశగా కృషిచేయాలని బిడ్డర్లకు సూచించారు. బొగ్గు గనుల కోసం ఇచ్చిన భూమిని సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలన్నారు. ఇదే సమయంలో.. గనుల్లో భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కిషన్ రెడ్డి సూచించారు. అంతకుముందు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని.. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. భారత్-ఆస్ట్రేలియాల మధ్య బొగ్గు, ఖనిజాలకు సంబంధించిన అంశాల మధ్య జరిగిన ఒప్పందాలు, రానున్న రోజుల్లో ఈ భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు పరస్పర సహకారం తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా, శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News