రైతులకు కేంద్రం మరో గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బు జమ
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పీఎం కిసాన్ పథకం కింద 16వ విడత నిధులును ఇవాళ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.2 వేల చొప్పున నగదును జమ చేయనున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 15 విడతలు అకౌంట్లలో డబ్బు జమ చేయగా.. నేడు 16వ విడత నిధులను కేంద్ర జమ చేయనుంది.
చివరగా గతేడాది నవంబర్ 23న లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేసింది. 15వ విడతతో 9,01,73,669 మంది రైతులకు లబ్ధి చేకూరింది. అయితే, పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే, ఈ-కేవైసీ చేసి ఉండాలి. అర్హులైన రైతుల ఖాతాల్లో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్) పద్ధతిలో పెట్టుబడి సాయం జమ అవుతుంది. ఈ పథకం రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. pmkisan-ict@gov.inకు ఈ-మెయిల్ చేయవచ్చు. లేదా 155261, 1800115526 లేదా 011-23381092 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.