Viveka Case: అవినాశ్‌రెడ్డికి మళ్లీ నోటీసులు
కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మళ్లీ సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు...
దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మళ్లీ సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. వివేకానందారెడ్డి హత్య కేసులో ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. నిజానికి ఈ కేసులో మంగళవారం ఉదయం హాజరుకావాల్సి ఉంది. అయితే ముందుగా కొన్ని కార్యక్రమాలు ఉండటం వల్ల నాలుగు రోజులు సమయం కావాలని సీబీఐ అధికారులకు అవినాశ్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించి సీబీఐ 19న హైదరాబాద్ కోఠిలోని తమ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది.
కాగా మాజీమంత్రి వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అనుమానితుడిగా సీబీఐ ఆరోపిస్తోంది. వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి సాక్ష్యాలు లేకుండా చేసేందుకు అవినాశ్ రెడ్డి యత్నించారని సీబీఐ ఆరోపిస్తోంది. అదే సమయంలో హత్య జరిగిన సమయంలో నిందితులు అవినాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు సీబీఐ తెలిపిన సంగతి తెలిసిందే. ఈకేసు విచారణ ముందుకు వెళ్లాలంటే ఎంపీ అవినాశ్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వెంటనే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది.
అయితే అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 25 వరకు అరెస్ట్ చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్ సునీతారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసింది. ఇలాంటి తరుణంలో మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులను సైతం కొట్టేసిన నేపథ్యంలో అరెస్ట్ చేసినా అడ్డంకులు ఏమీ ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతుంది.
Also Read..
వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరైన పులివెందులకు ఆ ముగ్గురు వ్యక్తులు