BREAKING: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.

Update: 2024-07-22 06:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవి. విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు నోటు కేసులో నిందితులైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కేసు ట్రయల్‌ని హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్- భోపాల్ మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కి రిజాయిండర్ దాఖలు చేసేందుకు తమకు రెండు వారాల సమయం కావాలని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. ఈ క్రమంలోనే అసలు పిటిషన్ ఎందుకు బదిలీ చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. నిందితుడిగా ఉన్న వ్యక్తి సీఎం అయితే.. కోర్టులు ఎలా ప్రభావితం అవుతాయని ధర్మాసనం ప్రశ్నించింది. దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్నత వ్యక్తులపై కేసులు నమోదైతే.. పాకిస్తాన్ మార్చాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రాసిక్యూట్ చేసే ఏజన్సీలు తమ అభిప్రాయం, వాదన మార్చుకునే అవకాశాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఆధారాలు తారుమారు చేయవచ్చని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు ఉంటాయని న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలిస్తూ.. విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Tags:    

Similar News