వివాదాలకు కేరాఫ్.. మాజీ మంత్రి మల్లారెడ్డి చుట్టూ వైఫైలా కాంట్రవర్సీలు
‘పాలమ్మినా... పూలమ్మినా.. విద్యా సంస్థలు నడిపినా.. ఇంజనీర్లు.. డాక్టర్లను తయారు చేసినా.. రికార్డుల్లోకెక్కినా..’
దిశ, తెలంగాణ బ్యూరో ‘పాలమ్మినా... పూలమ్మినా.. విద్యా సంస్థలు నడిపినా.. ఇంజనీర్లు.. డాక్టర్లను తయారు చేసినా.. రికార్డుల్లోకెక్కినా..’ ఈ డైలాగ్ వినగానే మీకు ఠక్కున గుర్తొస్తారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇలాంటి డైలాగ్‌లతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తరుచూ వివాదాలను కోరి తెచ్చుకుంటున్నారు. రాజకీయాలైన, వ్యాపారాలైన, భూ కబ్జాలైన ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఉండదు. మల్లారెడ్డి బీఆర్ఎస్‌లోకి అడుగు పెట్టినప్పట్నించి ఆయన చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన నియోజకవర్గం పరిధిలోనే శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తిని రేకేత్తిస్తోంది.
గిరిజనుల భూములపై నజర్..
మేడ్చల్ జిల్లా, మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35 లో గల 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ(లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. కేతావత్ బిక్షపతి నాయక్ అనే వ్యక్తి మా పెద్దల నుంచి మాకు వారసత్వ హక్కుగా వచ్చిన భూమిని మాజీ మంత్రితో సహ తన అనుచరులు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. ఈ భూమి మా కుటుంబ సభ్యలైన ఆరుగురి పేరు మీద ఉందని పేర్కొన్నారు.
మంత్రితో సహా తొమ్మిది మందిపై కేసు
బాధితుడు బిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ మాజీ సర్పంచ్ భర్త గోనే హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా(డీసీఎంఎస్) సహకార సంఘం వైస్ ఛైర్మన్, శామీర్ పేట మండల వ్యవసాయ సహకార సేవా సంఘం ఛైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపై శామీర్ పేటలో ఐపీసీ 420 చట్టం కింద చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. వీరిపై నాలుగు సెక్షన్ల కేసులు నమోదు చేసినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
రాత్రి 11 గంటలకు రిజిస్ట్రేషన్..
భూమిపైన కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి దాన్ని ఏలాగైనా కాజేయాలని కుట్రతో తన అనచరులతో కలిస మాకు మాయ మాటలు చెప్పి నమ్మించి మా ఏడుగురితో రూ.250 కోట్ల విలువైన భూమిని పీటీ సరెండర్ చేయించారని ఫిర్యాదు దారడు బిక్షపతి పేర్కొన్నారు. మా భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి ఎస్టీ లంబాడీలమైన మాపై అట్రాసిటీకి పాల్పడ్డారని, మా ఏడుగురికి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున డబ్బు ఇచ్చి రాత్రి 11 గంటల సమయంలో మూడు చింతలపల్లి తాహసీల్దార్ వాణిరెడ్డితో తన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు.
మంత్రికి అండగా ఉండి రూ.20 లక్షలు లంచం తీసుకోని తమతో రాత్రి వేళ భూమి రిజిస్ట్రేషన్ చేయించిన తాహసీల్దార్ వాణిపైన కేసులు నమోదు చేయాలని బిక్షపతి నాయక్ డిమాడ్ చేశారు. భూమిని అర్దరాత్రి రిజిస్ట్రేషన్ చేసుకుని మోసం చేసిన మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులు 9 మందిపై సమగ్ర విచారణ చేపట్టాలని, తమ భూమిని తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలోనూ మరో భూ వివాదంలో..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం సర్వే నెంబర్ 115, 116,117 లలోని 2.13 ఎకరాల భూమి పొన్న బోయిన పద్మావతి అనే మహిళ పేరు మీద ఉండేది. చామకూర మల్లారెడ్డి తన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిలు తన తల్లి పద్మావతి పేరు మీద ఉన్న భూమిని కబ్జా చేశారని ఆమె కుమార్తె శ్యామలాదేవి 2017లో ఫిర్యాదు చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో శ్యామలాదేవి హై కోర్టును అశ్రయించి, తమ భూమిని కబ్జా చేయడమే కాకుండా మల్లారెడ్డి అతని కుమారుడితో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంది. కోర్టు అదేశాల మేరకు దుండిగల్ పోలీసులు మల్లారెడ్డితో సహా అతని కుమారుడిలపై 2020, డిసెంబర్‌లోనే కేసు నమోదు చేశారు.