విద్యావ్యవస్థపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

తెలంగాణ (Telangana) విద్యావ్యవస్థపై బుధవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది.

Update: 2024-09-11 13:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) విద్యావ్యవస్థపై బుధవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లు పాటించాల్సిన మార్గదర్శకాలపై సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు (Sridhar babu), సీతక్క (Seethakka) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ విద్యావ్యవస్థలో తీసుకు రావాల్సిన ముఖ్యమైన సంస్కరణల గురించి చర్చించారు. ఢిల్లీలో జరిగిన కోచింగ్ సెంటర్ విషాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోచింగ్ సెంటర్లు పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలు రూపొందించి, అన్ని రాష్ట్రాలు ఆ ఆదేశాలను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాము జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా.. కేంద్రం రూపొందించిన గైడ్​లైన్స్ ను రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అలాగే పోటీ పరీక్షలు, ఎంసెట్, నీట్ లాంటి ప్రవేశ పరీక్షల కు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లను కంట్రోల్ చేస్తామని ఆయన తెలిపారు. కోచింగ్ సెంటర్లపై నియంత్రణ లేకపోవడంతో అభ్యర్థుల భద్రత, ఫీజుల భారంపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై కమిటీపై పరిశీలిస్తామని చెప్పారు. ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని శ్రీధర్ బాబు ఈ మీటింగ్ లో పేర్కొన్నారు. సర్కార్ స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా మారిస్తే పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదన్నారు. విద్యార్థులు లేని 1600 స్కూళ్లలోని టీచర్లను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని ఆదేశించారు. అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లు వేర్వేరుగా నడుస్తుండటంతో, మానవ వనరులు వృథా అవుతున్నాయని, ఈ రెండింటినీ విలీనం చేసే అంశంపై స్టడీ చేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు.


తెలంగాణలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని శ్రీధర్ బాబు సూచించారు. మాసబ్ ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లోని పబ్లిక్ పాలసీ స్టూడెంట్లను ఏడాది పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్ద ఇంటర్నీలుగా పనిచేసే అవకాశం కలిస్తామన్నారు. తద్వారా వారికి ప్రభుత్వ పాలనపై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ సెక్టార్​లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివే విద్యార్థులకు పరిశ్రమల్లో ఆన్ హ్యాండ్ శిక్షణనిస్తే వారికి వెంటనే ఉద్యోగాలు దొరుకుతాయని వెల్లడించారు. పిల్లల్లో సృజనాత్మకతను బయటకు తెచ్చేలా ప్రతి కాలేజీ డిజిటల్ మ్యాగజైన్ నడపాలన్నారు. ట్రిపుల్ ఐటీల్లో బయో సైన్సెస్, ఫార్మా కోర్సులను వచ్చే ఏడాది నుంచే ప్రవేశ పెట్టేలా పాఠ్యాంశాలు రూపొందించాలని ఆదేశించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో కేవలం పాఠాలే కాకుండా విద్యార్థులను సమాజం కోసం ఆలోచించేలా ప్రోత్సహించాలని పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ మంత్రి సీతక్క సూచించారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. 5,6 తరగతుల పుస్తకాల్లో మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో చేర్చాలని ఆదేశించారు. టాలెంటెడ్ టీచర్లున్నా.. విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థలకు ఎందుకు పోతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, ఫీజులపై నియంత్రణ లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం విద్యాశాఖపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మీటింగ్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఇంటర్ బోర్డు సెక్రెటరీ శృతిఓజా, విద్యాశాఖ స్పెషల్ సెక్రెటరీ హరిత, స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్లు లింగయ్య, రమేష్, టెక్నికల్, హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు శ్రీనాథ్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News