నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం ఉదయం మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరగనున్నది.

Update: 2024-01-08 02:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం ఉదయం మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరగనున్నది. గత నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రోగ్రామ్‌పై సమీక్షించనున్నారు. వచ్చిన దరఖాస్తులు, నిధుల సమీకరణపై చర్చించి నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించే అవకాశమున్నది. దరఖాస్తుల ప్రాసెసింగ్ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం ఈ సమావేశంలోనే ప్రారంభించనున్నారు.

వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన దరఖాస్తులను పరిశీలించి అధికారులను లబ్ధిదారులను ఎంపికచేస్తారు. అన్ని డిపార్ట్‌మెంట్లను అనుసంధానం చేస్తూ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దరఖాస్తుల డాటా ప్రాసెసింగ్ (దరఖాస్తులకు నంబర్ల కేటాయింపు) ప్రక్రియ జిల్లా కేంద్రాల్లో కొనసాగుతోంది. ప్రజాపాలనలో 1.25 కోట్ల కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఐదు గ్యారెంటీలకు 1.05 కోట్ల దరఖాస్తులు అందాయి. అర్హులైనవారిని గుర్తించడానికి మార్గదర్శకాల రూపకల్పనపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఐదు గ్యారెంటీలతో పాటు కొత్త రేషను కార్డులు, ఆసరా పింఛన్ల రిక్వెస్టులు, భూముల సమస్యలకు సంబంధించినవి రావడంతో వాటి స్వభావాన్ని ఈ మీటింగులో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రి నిర్దిష్ట షెడ్యూలు ప్రకటించే అవకాశమున్నది.

నిధుల సమీకరణపైనా చర్చలు

గ్యారెంటీలను అమలు చేయడానికి అవసరమైన నిధులపై రెవెన్యూ, ఫైనాన్స్ డిపార్టుమెంట్ల అధికారుల నుంచి వివరాలను సేకరించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులు, రుణం రూపంలో సమీకరించుకునే వెసులుబాటు, వంద రోజుల్లోనే అమలు చేయాలనే టార్గెట్ ఉన్నందున వాటికి అవసరమైనట్లుగా రిజర్వులో ఉంచుకుని కేటాయించి విడుదల చేయడం.. ఇలాంటి అంశాలన్నింటిపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నది.

టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చలు

సీఎం నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేయడం, కొత్త పాలకమండలిని నియమించడం, రెగ్యులర్ ఎంప్లాయీస్‌ను డిప్యూట్ చేయడం తదితర అంశాలపై చర్చ జరగనున్నది. ఫిబ్రవరి చివరికల్లా కనీసంగా 22 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో దానికి తగిన ఏర్పాట్లను టీఎస్పీఎస్సీ ద్వారా పూర్తి చేసేందుకు కసరత్తు మొదలైంది. పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను నాలుగు వారాల వ్యవధిలో కంప్లీట్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ టార్గెట్‌లో దాదాపు 18 వేలకు పైగా పోస్టులు భర్తీ కానున్నాయి. మరికొన్ని జాబ్‌లకు సంబంధించిన నియామక ప్రక్రియ కూడా కంప్లీట్ కానున్నది.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై దర్యాప్తు

మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించనున్నట్లు పేర్కొన్నది. దీనిపై సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలిసింది. అధికారులతో సంబంధం లేకుండా విడిగా మంత్రులంతా రానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశమున్నది. ఈ నెల 11న నోటిఫికేషన్ వెలువడనున్నందున గెల్చుకునే రెండు స్థానాల్లో ఎవరికి అవకాశమివ్వాలనేదానిపై చర్చించనున్నారు.

జిల్లాల వారీగా అందిన దరఖాస్తుల వివరాలు (లక్షల్లో )

హైదరాబాద్ : 13.7

రంగారెడ్డి : 10. 2

మల్కాజిగిరి : 9.2

నల్గొండ : 6.1

నిజామాబాద్ : 5.9

ఖమ్మం : 5.5

సంగారెడ్డి : 4.4

సిద్ధిపేట : 3.8

సూర్యాపేట : 4.2

జగిత్యాల : 3.9

కొత్తగూడెం : 3.7

కరీంనగర్ : 3.5

వరంగల్ : 3.3

మహబూబ్ నగర్: 3.2

వికారాబాద్ : 3.1

మెహబూబాబాద్: 3.1

కామారెడ్డి : 3.1

హనుమకొండ: 2.93

మంచిర్యాల : 2.83

నిర్మల్ : 2.80

మెదక్ : 2.73

పెద్దపల్లి : 2.69

భువనగిరి : 2.54

ఆసిఫాబాద్ : 2.20

సిరిసిల్ల : 2.15

నారాయణపేట్: 2.09

నాగర్ కర్నూల్: 2.03

గద్వాల : 1.95

ఆసిఫాబాద్ : 1.82

భూపాలపల్లి : 1.46

ములుగు : 1.10

మొత్తం : 125.84

Tags:    

Similar News

టైగర్స్ @ 42..