తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ అయింది.ఈ సమావేశంలో రేపు(జనవరి 6) శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. దాదాపు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.
కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమనాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు నాందేడ్‌లో కేసీఆర్ సభ ఉంటుంది. కేసీఆర్ సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు. మహారాష్ట్ర నేతల చేరికల అనంతరం కేసీఆర్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ హైదరాబాద్‌కు రానున్నారు. కాగా, సీఎం కేసీఆర్ హాజరవుతున్న నాందేడ్ బహిరంగ సభకు 60 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. మహారాష్ట్రలోని హింగోలి కేంద్రంగా భూ ప్రకంపన సంభవించగా...రిక్టర్ స్కెల్ పై 3.1గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.