రోడ్డు ఆక్రమించి స్లాబ్ నిర్మాణం.. నోటీసులిచ్చి చేతులు దులుపుకున్న అధికారులు

వైరా మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ భవనాల నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కొంతమంది కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలను నిర్మిస్తున్నారు.

Update: 2024-06-12 08:24 GMT

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ భవనాల నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కొంతమంది కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలను నిర్మిస్తున్నారు. మరి కొంతమంది మున్సిపాలిటీ నుంచి వారు తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణాలను చేపడుతున్నారు. అయినప్పటికీ నిర్మాణాలను గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ భవనాల నిర్మాణాలను పర్యవేక్షించాల్సిన టీపీవో వైరాలో విధులకు రాక 20రోజులు దాటిందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైరాలోని పాత బస్టాండ్ పెట్రోల్ బంక్ సమీపంలో వజ్రా టీవీఎస్ షోరూం ఏర్పాటు చేసేందుకు సుమారు 500 గజాల స్థలంలో భారీ రేకుల షెడ్డును నిర్మించారు. అయితే ఈ రేకుల షెడ్డు నిర్మాణానికి కనీస అనుమతులు తీసుకోలేదు. అయితే ఈ షెడ్డు నిర్మించిన వ్యక్తి తనకు ఓ ఐఏఎస్ అధికారి అండ ఉందని మీరేం చేయలేరంటూ మున్సిపాలిటీ అధికారులను బెదిరిస్తున్నట్లు తెలిసింది.

ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భారీ షెడ్యూల్ నిర్మించిన నంబూరు వెంకటరమణకు గత ఏప్రిల్ 24వ తేదీన వైరా మున్సిపాలిటీ కమిషనర్ నోటీసు జారీ చేశారు. అయితే నేటి వరకు నోటీసుకి సదరు యజమాని వివరణ ఇవ్వలేదని తెలిసింది. అదేవిధంగా వైరాలోని మధిర రోడ్‌లో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా సుమారు 500 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తు నిర్మాణం జరుగుతోంది. మున్సిపాలిటీ నుంచి తీసుకున్న అనుమతులకు ఇక్కడ చేపడుతున్న నిర్మాణాలకు ఎలాంటి పొంతన లేకుండా పోయింది. కనీసం సెట్ బ్యాక్‌లు తీయకుండా, పార్కింగ్‌కు స్థలం లేకుండా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ భవన నిర్మాణం కొనసాగుతున్న విషయం మున్సిపాలిటీ అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు విని వస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్న యజమాని చావా వికాస్‌కు మంగళవారం మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా వైరాలోని మధిర క్రాస్ రోడ్ సమీపంలో ఓ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీ రోడ్డు ఆక్రమించి స్లాబ్లు వేయడం విశేషం. అంతేకాకుండా ఎలాంటి సెట్ బ్యాకులు ఈ భవనానికి తీయలేదు. అనుమతికి మించి అంతస్తులు నిర్మించేందుకు పిల్లర్లు నిర్మించారు. వైరా నడిబొడ్డున నిబంధనకు విరుద్ధంగా ఈ భవన నిర్మాణం కొనసాగుతున్న అధికారులు కేవలం నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైరాలో అక్రమంగా చేపడుతున్న భవన నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News