సర్కారుపై ప్రజల భారీ ఆశలు.. ఈ ఏడాది ఎన్నికలతో వరాలుండేనా?
రాష్ట్ర బడ్జెట్ అంచనాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర జీఎస్‌డీపీ కూడా పెరుగుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్ అంచనాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర జీఎస్‌డీపీ కూడా పెరుగుతున్నది. తలసరి ఆదాయంతో పాటు తలసరి అప్పు కూడా ఎగబాకుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం రూ. 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో తొమ్మిది నెలల్లో ఖర్చు చేసింది కేవలం రూ.1.24 లక్షల కోట్లు మాత్రమే. నెలకు సగటున రూ. 10 వేల కోట్ల చొప్పున ఖర్చు చేసింది. జనవరి-మార్చి నెలల్లో కూడా ఈ సగటు ప్రకారం ఖర్చు చేస్తే మొత్తం పన్నెండు నెలల ఖర్చు రూ. 1.60 లక్షల కోట్లు దాటడం కష్టమే. ఆ ప్రకారం ఇంకా ఖర్చు చేయాల్సింది సుమారు రూ. 90 వేల కోట్లు ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వనరులు లేకపోవడంతో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి కాసుల చిక్కులు ఎదురయ్యాయి.
సంవత్సరం మొత్తానికి రూ.2.56 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే తొమ్మిది నెలల్లో కేవలం రూ. 1.39 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంచనాలో ఇది కేవలం 57%. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ. 41 వేల కోట్లకుగాను తొమ్మిది నెలల్లో రూ.7,770 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక రిజర్వు బ్యాంకు ద్వారా రూ.52,167 కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటే మొత్తం పన్నెండు నెలలకు రూ.36,750 కోట్లకు మాత్రమే అనుమతి వచ్చింది. ఈ రెండు పద్దుల్లోనే రాష్ట్రానికి సుమారు రూ.48,648 కోట్లు అందకుండా పోయింది. దీంతో కొత్త బడ్జెట్ (2023-24)ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సవరణలు చేయనున్నది. గతేడాది (2021-22) బడ్జెట్‌ను తొలుత రూ.2.30 లక్షల కోట్లకు అంచనా వేస్తే సవరణల్లో అది రూ.2.09 లక్షల కోట్లకే పరిమితమైంది.
ఈ సంవత్సరం కూడా సవరించిన అంచనాల్లో ఏ మేరకు కోత పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అనుకున్న అంచనాల ప్రకారం ఆదాయం అందకపోవడంతో సంక్షేమ పథకాల అమలుకు, అభివృద్ధి పనుల కోసం చేసే కాపిటల్ ఎక్స్ పెండిచర్ గణనీయంగా పడిపోయింది. దాదాపు మూడింట ఒక వంతు ఖర్చు పెండింగ్‌లో పడింది. ఆదాయం సైతం అంతే స్థాయిలో అందకుండా పోయింది. ఇదిలా ఉండగా వచ్చే అర్థిక సంవత్సరానికి బడ్జెట్ సైజును ప్రభుత్వం ఏ మేరకు పెంచుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ప్రతీ సంవత్సరం సగటున 15% మేర బడ్జెట్ సైజు పెరుగుతూ ఉన్నది. ఈసారి కూడా అంతే స్థాయిలో పెరుగుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది. దాదాపు రూ. 2.85 లక్షల కోట్లు దాటొచ్చని ఆర్థిక శాఖ అధికారుల అంచనా. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశం రానున్న ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీ, కౌన్సిల్‌లో సోమవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
స్కీమ్‌ల అమలుకు ఆటంకాలు :
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసుకున్న విధంగా ఆదాయం సమకూరకపోవడం అధికారులను గందరగోళానికి గురిచేసింది. దీంతో సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు చిక్కులు ఎదురయ్యాయి. దళితబంధు స్కీమ్‌కు బడ్జెట్‌లో రూ. 17,700 కోట్లు కేటాయింపు చేసినా పదిన్నర నెలల వ్యవధిలో ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. విద్యార్థుల ఫీజు రీఇంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్పుల విషయంలోనూ అంతే. యాదవ, కుర్మలకు మేకల, గొర్రెల పథకం, రైతుల రుణమాఫీ లాంటివి అటకెక్కాయి. రైతులకు లక్ష రూపాయల్లోపు ఉన్న రుణాలను నాలుగు సంవత్సరాల వ్యవధిలో సంపూర్ణంగా మాఫీ చేస్తామని 2019 బడ్జెట్‌లోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకు రూ. 35 వేల వరకు రుణాలున్న రైతులకు మాత్రమే అమలైంది. నాలుగేళ్ళు పూర్తవుతున్నా ప్రభుత్వ హామీ సంపూర్ణం కాలేదు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గతేడాది తలసరి ఆదాయం రూ. 2.75 లక్షలుగా ఆర్థిక శాఖ అంచనా వేసింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రస్తావించిన మంత్రి కేటీఆర్ ఈసారి అది రూ. 3.11 లక్షలకు పెరుగుతుందని సూచనప్రాయంగా తెలిపారు. దీనికి తగినట్లుగానే రాష్ట్ర జీఎస్‌డీపీ కూడా గతేడాది అంచనా ప్రకారం ఉన్న రూ. 11.48 లక్షల కోట్ల నుంచి ఈసారి రూ. 13 లక్షల కోట్లు దాటే అవకాశమున్నది. ఈ ప్రకారం రిజర్వు బ్యాంకు ద్వారా ఎఫ్ఆర్‌బీఎం పరిమితి మేరకు తీసుకునే అప్పు పరిమాణం కూడా పెరగడానికి ఆస్కారమున్నది. ఇంకోవైపు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో గత రెండేళ్లుగా అంచనాల్లో కేవలం పావు వంతు మాత్రమే అందుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవకాశాలను వదులుకోరాదన్న ఉద్దేశంతో భారీ స్థాయిలోనే పేర్కొంటున్నది.
సవాలుగా ఆదాయ వనరుల సమీకరణ
రాష్ట్ర జీఎస్‌డీపీకి అనుగుణంగా బడ్జెట్ సైజును రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్నా దానికి తగిన ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటుందనేది కీలకంగా మారింది. గతేడాది అవసరాల కోసం భూముల విలువను సవరించి రిజిస్ట్రేషన్ చార్జీలు, విద్యుత్ ఛార్జీల, మోటారు వాహనాల పన్ను, మద్యం ధరలు, దుకాణాల లైసెన్సు ఫీజు తదితరాలను పెంచింది. అయినా అంచనాలకు తగినట్లుగా ఆదాయం సమకూరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్ సైజును సగటున 15% మేర పెంచినా అది రూ. 2.85 లక్షల కోట్లను దాటే అవకాశం ఉన్నది. దానికి తగినట్లుగా సంక్షేమ పథకాల ఖర్చును కూడా ఎక్కువ చేయనున్నది. అయితే ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోతే వెల్ఫేర్ స్కీమ్‌లకు ఇవ్వాల్సిన నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉన్నది.
ఇప్పటికే దళితబంధు, రైతు రుణమాఫీ, స్వంత జాగ ఉన్న కుటుంబాలకు తలా రూ. 3 లక్షల ఆర్థిక సాయం తదితర స్కీమ్‌లకు నిధులను కేటాయించినా అమలు జాడే లేదు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ హామీపై ఇప్పటికీ బల్లగుద్ది మరీ చెప్తున్నా ఆ శాఖ అధికారులు మాత్రం రోజుకు 14 గంటలు మాత్రమే ఇవ్వగలుగుతున్నామని చెప్తున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు.. ధర్నాలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి స్కీమ్ గురించి రెండేళ్ల క్రితం హామీ ఇచ్చినా అది కాగితాలకే పరిమితమైంది. జాబ్ నోటిఫికేషన్లను జారీ చేయడంతో ఇక నిరుద్యోగం గురించి మాట్లాడడానికి సర్కారు సిద్ధపడడంలేదు. బడ్జెట్‌లో కొత్త స్కీమ్ గురించి ప్రస్తావించి దానికి కేటాయింపులు చేసే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమలైనా కాకపోయినా రికార్డుల్లో ఉంటుందని, ప్రజలకు ఒక హామీ ఇచ్చినట్లవుతుందనే అభిప్రాయం నెలకొన్నది.
అలాంటి హామీలు ఇప్పుడు దళితబంధు, రైతు రుణమాఫీ, స్వంత ఇంటికి రూ. 3 లక్షల సాయం లాగ కాగితాలకే పరిమితమవుతుందా అనే అనుమానాలు లేకపోలేదు.
సర్కారుపై ప్రజల భారీ ఆశలు
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అధికార పార్టీ సరికొత్త హామీలను ఇస్తుందని ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే దేశమే అబ్బురపడే, అడ్డంపడే, ఆశ్చర్యపడే స్కీమ్‌ను రైతుల కోసం అమలుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ మూడేళ్ళు దాటిని అది ఆచరణకు నోచుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు ఈ సంవత్సరం కొత్త హామీని ఇస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. స్వంత జాగ ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం విషయంలో గతేడాది హామీ ఇచ్చినా మార్గదర్శకాలనే రూపొందించలేదు. ఈసారి బడ్జెట్‌లో దీని గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతి నెలా పింఛను ఇచ్చే హామీపై గతంలో పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. కొత్త బడ్జెట్‌లో దాని ప్రస్తావన ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల్లో గెలిచి మరోసారి పవర్‌లోకి రావడానికి కచ్చితంగా బీఆర్ఎస్ హామీ ఇవ్వనున్నదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. అది ఎలాంటి హామీ, దాన్ని బడ్జెట్‌లో ప్రస్తావిస్తుందా, ఫండ్స్ కేటాయిస్తుందా, ఎన్నికలు జరిగే టైమ్‌కు అమలును ప్రారంభిస్తుందా.. ఇలాంటి చర్చలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే అందరి చూపూ కేంద్రీకృతమైంది.
Also Read..