వరంగల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ప్రీతి ఘటన మరువక ముందే వరంగల్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నర్సంపేట డివిజన్‌లోని జయముఖి కళాశాలలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న రక్షిత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.
దిశ, నర్సంపేట: ప్రీతి ఘటన మరువక ముందే వరంగల్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నర్సంపేట డివిజన్‌లోని జయముఖి కళాశాలలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న రక్షిత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. రక్షిత ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారామే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో పదో తరగతి చదువుకునే రోజుల్లో రాహుల్ అనే అబ్బాయితో రక్షితకు పరిచయం ఏర్పడింది. అతడు కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు చెబుతున్నారు. ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడని, దీనిపై రక్షిత పోలీసులకు కూడా గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు పిలిచి రాహుల్‌కి కౌన్సిలింగ్ ఇవ్వగా.. ఆ తర్వాత కూడా అతడిలో మార్పు రాలేదని చెబుతున్నారు. వేధింపులు తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేగాక, గత మూడు నెలల కిందట హాజరు శాతం తక్కువగా ఉండటంతో రక్షిత డిటైన్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత మూడు నెలలుగా రక్షిత కాలేజీకి వెళ్లడంలేదు. వరంగల్‌లోని బంధువుల ఇంట్లో ఉంటున్నది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రక్షిత ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా... గత రెండు రోజుల క్రితం రక్షిత స్వస్థలం భూపాలపల్లిలో ఆమెపై మిస్సింగ్ కేస్ నమోదయినట్లు తెలుస్తోంది. రక్షిత ఆత్మహత్యకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.