సమీకృత జర్నలిస్ట్ పాలసీని తీసుకొస్తాం.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్

బీఎస్పీ అధికారంలోకి రాగానే జర్నలిస్ట్ పాలసీని రూపొందిస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు.

Update: 2023-05-18 15:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు సమీకృత జర్నలిస్ట్ పాలసీని రూపొందించి జర్నలిస్టుల ఆకాంక్షలు నెరవేరుస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం జర్నలిస్టుల పోరాటానికి ఒక ప్రకటనలో మద్దతు తెలిపారు. మీడియా నిజాలు రాస్తే బెదిరింపులకు గురి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని తమ బినామీ కంపెనీలకు అమ్ముతున్న కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం తొమ్మిదేళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

గత ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ హామీలను తుంగలో తొక్కారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే కేసీఆర్ సర్కారు మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

Tags:    

Similar News