BRS to TRS: టీఆర్ఎస్‌గా బీఆర్ఎస్?.. గులాబీ పార్టీలో కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్

నేమ్ చేంజ్ విషయంలో బీఆర్ఎస్ సంచలనం దిశగా అడుగులు వేస్తోందా?..

Update: 2024-10-09 09:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో చక్రంతిప్పిన బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ తన పేరును మార్చుకున్నాక జరిగిన తొలి ఎన్నికల్లోనే భంగపాటుకు గురైంది. దీంతో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా పార్టీ పేరును మార్చడం వల్లే ఓటమి పాలయ్యామని అందువల్లే తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాల్సిందేనని నేతలు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిన్న స్పందించిన కేటీఆర్.. జాతీయ పార్టీలను నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందన్నారు. 2029లో కేంద్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. దీంతో జాతీయ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ప్రాంతీయ పార్టీలకు మద్దతుగా మాట్లాడటం వెనక ఏం జరుగుతోందనే చర్చ జోరందుకుంది.

ఇటీవలే తమిళనాడుకు బీఆర్ఎస్ టీమ్..

ఉద్యమపార్టీగా మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానంలో పార్టీ పేరు మార్పుతో కొత్త టర్న్ తీసుకుంది. టీఆర్ఎస్ అనే అక్షరాలు పార్టీ పేరుకే కాదు ఉద్యమ ఉనికికి పర్యాయపదాలుగా మారాయనే టాక్ ఉండేది. కానీ కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చీ జాతీయ పార్టీగా ప్రకటించడంతోనే పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్న పేగుబంధం తెగిపోయిందనే అందువల్లే పార్టీకి ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఏర్పడుతోందనే అభిప్రాయాలు సొంత పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి. టీఆర్ఎస్ పేరు తిరిగి మార్చాలని కేసీఆర్ సన్నిహితులుగా పేరున్న మాజీ ఎంపీ వినోద్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయనిపుణులతో సంప్రదింపులు సైతం చేస్తున్నట్లు గతంలో కొంతమంది నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రోజురోజుకు కాంగ్రెస్, బీజేపీలు మరింతగా పుంజుకుంటుంటే బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్‌ఫాల్ కావడం ఖాయమని, అందుకే తిరిగి టీఆర్ఎస్‌గా పార్టీ పేరు మార్చేందుకు ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయనే చర్చ కూడా వినిపిస్తున్నది. ఇటీవల బీఆర్ఎస్ టీమ్ ఒకటి తమిళనాడుకు వెళ్లి అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే పార్టీ నిర్మాణంపై అధ్యయనం చేసి వచ్చింది. ఇంతలోనే తమది జాతీయ పార్టీ అయినా రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని చెప్పడం హాట్ టాపిక్ అయింది.

కేసీఆర్ వ్యాఖ్యలకు భిన్నంగా కేటీఆర్ మాటలు..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ పేరు మార్పు విషయంలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో ఓ టీవీ చర్చలో అధినేత కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్‌గా మారేందుకు చాయిస్ లేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పేరును ఇతరులకు కేటాయించకుండా ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్‌గా మార్చే అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే జాతీయ స్థాయిలో తమ ప్రభావాన్ని చూపుతామన్నారు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీగానే బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేస్తే కేటీఆర్ మాత్రం ప్రాంతీయ పార్టీలది కీలక పాత్ర అని వ్యాఖ్యానించడం ఏంటనే టాక్ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు మరోసారి బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నమా లేక నిజంగానే పార్టీ పేరు మార్పుకు సీరియస్‌గా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఉత్కంఠగా మారింది.

Similar News