ఫిబ్రవరికల్లా యాదగిరి గుట్ట విమాన గోపురం స్వర్ణమయం : ఈవో

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విమాన గోపురం బంగారు తాపడం పనులను వచ్చే ఫిబ్రవరి కల్లా పూర్తి చేయించనున్నట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్ రావు తెలిపారు.

Update: 2024-10-09 11:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విమాన గోపురం బంగారు తాపడం పనులను వచ్చే ఫిబ్రవరి కల్లా పూర్తి చేయించనున్నట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్ రావు తెలిపారు. స్వర్ణ తాపడం పనుల్లో భాగంగా వినియోగించే విమాన గోపురం విగ్రహాల రాగి రేకులను బుధవారం చెన్నైకి ట్రాన్స్ పోర్టు చేసే వాహనానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి ప్రత్యేత పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇప్పటికే విమాన గోపురం స్వర్ణ తాపడం పనుల కోసం రాగి రేకులను గోపురానికి అమర్చి చూసే పని పూర్తయినందునా వాటిని ఈ రోజు మంచి మూహుర్తం ఉన్నందునా స్వర్ణ తాపడం కోసం చెన్నై పంపిస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ తాపడం పనులకు దేవస్థానం నిధులు, భక్తుల విరాళాలు వినియోగించేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 27న అనుమతినిచ్చిందని తెలిపారు. వచ్చే మార్చి1వ తేదీ నుంచి శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఉన్నందునా విమాన గోపురం బంగారు తాపడం పనిని ఫిబ్రవరి-2025 వరకల్లా పూర్తి చేయుటకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ బంగారు తాపడం పనిని మెసర్స్ స్మార్ట్ క్రియేషన్స్, చెన్నై వారికి అప్పగించామని, వీరు గతములో ఇదే దేవాలయమునకు సంబంధించిన ధ్వజస్ధంబం, గర్భాలయం ముఖద్వార తాపడం పనులు చేశారని గుర్తు చేశారు.

విమాన గోపురం బంగారు తాపడం పనికి మొత్తం 60కిలోల బంగారం అవసరమవుతుందని తెలిపారు. విరాళాల ద్వారా 10కిలోల 500 గ్రాముల బంగారం, 20కోట్ల నగదు సమకూరిందని వివరించారు. ఈ 20 కోట్ల రూపాయలు నగదు విరాళాలతో సుమారు 26కిలోల బంగారం కొనుగోలు చేస్తామని, అలాగే దేవస్ధానానికి సంబంధించిన 13కిలోల గోల్డ్ బాండ్సు వాడుతామని వెల్లడించారు. అలాగే దేవస్ధానం వద్ద గల 2కిలోల బంగారంతో పాటు, 776 కిలోల వెండికి సమానంగా వచ్చు బంగారాన్ని సైతం స్వర్ణ తాపడం పనికి వాడటం జరుగుతుందని తెలిపారు. విమాన గోపురం స్వర్ణ తాపడం పని మొత్తం 10,000 చదరపు అడుగులు ఉంటుందని, మెసర్స్ స్మార్ట్ క్రియేషన్స్ కు చదరపు అడుగుకు రూ.3900/-ల చొప్పున మొత్తం పనికి రూ.3 కోట్ల 90లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేసి అప్పగించామన్నారు. ఈ మొత్తం వ్యయాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి చెల్లించనున్నామని తెలిపారు.


Similar News