BRS సెల్ఫ్ గోల్.. ‘సింగరేణి’ ఎన్నికల్లో కోలుకులేని దెబ్బ
బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా?
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా? సింగరేణి ఎన్నికల్లో పోటీపై పూటకో మాట మాట్లాడడం కొంపముంచిందా? పోటీలో ఉండట్లేదని ప్రకటించిన మరుసటి రోజే పోటీలో ఉంటామని చెప్పడం సంఘం నేతల గందరగోళానికి కారణమైందా? టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత దిశా నిర్దేశం పనిచేయలేదా? అసెంబ్లీ ఓటమి ఎఫెక్ట్ సింగరేణి ఎన్నికలపై పడిందా? హామీలు ఇచ్చినా కార్మికుల్లో నమ్మకం కలిగించలేకపోయారా? ఇన్ని ప్రతికూల అంశాల మధ్య బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ 9 డివిజన్లలో డిపాజిట్లు కోల్పోయింది. పార్టీ నేతల స్వయంకృతాపరాధం యూనియన్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. ఒక్క డివిజన్‌లోనూ విజయం సాధించలేక చతికిలపడింది. ఈ ఘోరపరాజయంతో గులాబీ నేతల్లో మరింత నైరాశ్యం నెలకొంది.
విశ్వసించని కార్మికులు
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ అనూహ్య రీతిలో కనుమరుగైంది. ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. సింగరేణిలోని నాలుగు డివిజన్లలో 11 ఏరియాలు ఉన్నాయి. వాటికి ఎన్నికలు నిర్వహించగా టీబీజీకేఎస్‌తో పాటు మరో 12 కార్మికసంఘాలు పోటీ చేశాయి. కానీ ఒక్క ఏరియాలోనూ సత్తా చాటలేకపోయింది. టీబీజీకేఎస్‌కు ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సంఘం నాయకులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సింగరేణి ఏరియాల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకోకపోవడంతో ప్రచారానికి గులాబీ నేతలు దూరంగా ఉన్నారు.
కార్మిక సంఘం నాయకులకే పూర్తి బాధ్యతను అప్పగించారు. టీబీజీకేఎస్ హామీలను కార్మికులు విశ్వసించలేదు. మణుగూరులో 728 ఓట్లు, శ్రీరాంపూర్‌లో 216 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఏరియాల్లో మాత్రమే డిజిపాట్లను దక్కించుకుంది. మిగిలిన 9 ఏరియాల్లో డబుల్ డిజిట్‌కే పరిమితం అయింది. ఇల్లందులో ఒకే ఒక్క ఓటు రాగా, బెల్లంపల్లిలో 3 ఓట్లు వచ్చాయి. కొత్తగూడెం కార్పొరేట్‌లో 33 ఓట్లు, కొత్తగూడెంలో 36 ఓట్లు, రామగుండం-1లో 37ఓట్లు, రామగుండం-2లో 47 ఓట్లు, రామగుండం-3లో 59 ఓట్లు, భూపాలపల్లిలో 57 ఓట్లు, మందమర్రిలో 81 ఓట్లు మాత్రమే వచ్చాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బాధ్యతను కవిత తీసుకున్నప్పటికీ ఘోరపరాజయం పాలవడంతో సంఘం ఉనికి ప్రమాదంలో పడింది.
అసెంబ్లీ ఎఫెక్ట్..?
అసెంబ్లీ ఎన్నికల ఓటమి సింగరేణిపై ఎఫెక్ట్ పడింది. ఆ బాధ నుంచి బయటపడక ముందే సింగరేణి ఎన్నికలు రావడంతో కార్మికుల్లో నైరాశ్యం నెలకొంది. పార్టీ సైతం ఒకసారి పోటీ చేయబోమని, మరోసారి పోటీ చేస్తామని ప్రకటనలతో కార్మికుల్లో సైతం గందరగోళం నెలకొంది. టీబీజీకేఎస్ నేతలు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. కీలక నేతలు చాలా మంది సంఘాన్ని వీడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ గనుల వద్ద ఎక్కడా గులాబీ జెండా కనిపించలేదు. ప్రచారంలోనూ ఆశించిన స్థాయిలో గులాబీ జెండాల సందడి కనిపించలేదు.
దీంతో సంఘంలోని కార్మికులు సైతం ఇతర సంఘాలకు ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో ఎన్నికల్లో ఓటమికి కారణమని కార్మిక నేతలు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధిస్తామని టీబీజీకేఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ కార్మికులు ఆ సంఘానికి షాక్ ఇచ్చారు. ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపైనా పడే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.