బ్రేకింగ్: కవిత అరెస్ట్ అయితే భారీ ప్లాన్‌కు సిద్ధం అవుతోన్న బీఆర్ఎస్..?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఐదుగురు అధికారుల బృందం దాదాపు గంటకు పైగా కవితను ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ విచారించిన వారిని.. దర్యాప్తు అనంతరం అరెస్ట్ చేసింది. కవితను కూడా విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేస్తే భారీగా నిరసనలను బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేయడానికి బీఆర్ఎస్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈడీ ఆఫీస్ ఎదుట బైఠాయించనున్నట్లు సమాచారం. కవిత అరెస్ట్ అయితే ఆప్ మద్దతుతో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆప్ నేతలతో బీఆర్ఎస్ అగ్ర నేతలు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కవితకు మద్దతుగా హస్తిన బాట పట్టారు. తాజాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే కవితకు మద్దతుగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా, సత్యవతి ఢిల్లీకి వెళ్లగా.. తాజాగా మరికొందరు రాజధాని బాటపడుతున్నారు.