తలోదారి వెతుక్కుంటున్న ఏపీ బీఆర్ఎస్ లీడర్లు.. ఎన్నికల లోపు ఖాళీ?
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నది. బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల ఇప్పటికే వైసీపీలో చేరారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సైతం జనసేనలో చేరబోతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నది. బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల ఇప్పటికే వైసీపీలో చేరారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సైతం జనసేనలో చేరబోతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసమంటూ ముఖ్యనేతలంతా తలోదారిని వెతుక్కుంటూ గులాబీని వీడుతున్నారు.
ఏడాదిలోపే..
జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. పార్టీ విస్తరణ చర్యలు చేపట్టారు. దీంతో ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, రిటైర్డ్ ఐఆర్ఎస్ పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో గతేడాది జనవరి 2న చేరారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. గతేడాది మార్చి 21న ఏపీలోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఆశించిన స్థాయిలో చేరికలు జరగలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోవడంతో పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. ఇప్పటి కేసీఆర్ ఏపీ పార్టీ కార్యాలయానికి వెళ్లలేదు. బహిరంగసభలు సైతం నిర్వహించలేదు. విశాఖ ఉక్కుపై సైతం పోరాటం చేస్తామని ప్రకటించి మరీ వెనక్కి తగ్గారు.
క్లారిటీ ఇవ్వని కేసీఆర్..
ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్, వైసీపీ ఒకటేననే ప్రచారం జరుగుతున్నది. త్వరలో ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనుండగా.. లీడర్లకు కేసీఆర్ ఎలాంటి యాక్టివిటీస్ అప్పజెప్పలేదు. ఏపీలోని లోక్ సభ స్థానాల నుంచి పోటీపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరారు. పత్తిపాడు నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సైతం జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకోసం జనసేన నేతలతో చర్చలు కూడా కొలిక్కి వచ్చాయని సమాచారం. ప్రస్తుతం గులాబీలో ఉన్న మిగతా కేడర్ సైతం నేతలతోపాటు పార్టీ మారబోతున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ లోకి ఒడిశా బీఆర్ఎస్ నేతలు
ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ గతేడాది జనవరిలో బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత పలుమార్లు కేసీఆర్ ను కలిశారు. ఆశించిన రెస్పాన్స్ లేకపోవడం, ఆతర్వాత కలిసేందుకు సమయం కూడా ఇవ్వకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆయన నారాజ్ గా ఉన్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గిరిధర్ గమాంగ్ తో పాటు బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
విస్తరణకు ఫుల్ స్టాప్!
ఒడిశా, ఏపీ రాష్ట్రాల్లో పార్టీకి చెందిన బీఆర్ఎస్ నేతలంతా పార్టీలు మారడంతో రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణకు ఫుల్ స్టాప్ పడిందనే చర్చ జరుగుతున్నది. మరోవైపు మహారాష్ట్ర నేతలకు సైతం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ నేతలకు సైతం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో సందిగ్ధంలోనే ఉన్నట్లు సమాచారం. లోక్ సభలో పోటీచేయకపోతే ఆ రాష్ట్ర నేతలు సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఒక్కొక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణకు బ్రేక్ పడుతున్నది.
చిరంజీవితో తోట చంద్రశేఖర్ భేటీ
కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి తో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గురువారం భేటీ అయ్యారు. పద్మ విభూషణ్ రావడంపై చిరంజీవికి తోట శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ జనసేనలో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో వీరిరువురి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.