ఓటమి తర్వాత రియలైజ్ అవుతోన్న BRS లీడర్స్.. ఎట్టకేలకు ఆ విషయం ఒప్పుకున్న కేకే..!
పార్లమెంటరీ స్థానాల సన్నాహక సమావేశాల్లో కేడర్ నుంచి వస్తున్న ప్రశ్నలు, అసంతృప్తిని నిశితంగా గమనిస్తున్న పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కేశవరావు ఏయే
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటరీ స్థానాల సన్నాహక సమావేశాల్లో కేడర్ నుంచి వస్తున్న ప్రశ్నలు, అసంతృప్తిని నిశితంగా గమనిస్తున్న పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కేశవరావు ఏయే ప్రాంతాల్లో ఏ స్థాయిలో ఉన్నదో అంచనా వేసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ముఖంమీదనే నిలదీయడాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సీట్ల సన్నాహక సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు, శ్రేణుల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తల్లో, జెండా మోసిన శ్రేణుల్లో, పార్టీతో కలిసి పనిచేసిన ఉద్యమకారుల్లో అసంతృప్తి, అసహనం, ఆగ్రహం ఉన్నది నిజమేనని, దీన్ని అర్థం చేసుకోగలమన్నారు.
కార్యకర్తలు లేకుంటే బీఆర్ఎస్ పార్టీయే లేదని, రెండున్నర దశాబ్దాల కాలంలో వారి పాత్ర ఎంత కీలకమైనదో పార్టీ గుర్తిస్తున్నదన్నారు. జెండా మోసిన కార్యకర్తలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించామన్నారు. వారికి పార్టీలో ఇకపైన సముచిత స్థానం ఉంటుందన్నారు. తెలంగాణలో, హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలే హీరోలన్నారు. ఏ గాలి కూడా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ గెలువును అడ్డుకోలేకపోయిందన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని అన్నారు. మంత్రిగా కేటీఆర్ చేసిన కృషి కూడా రాజధాని ఓటర్లను బీఆర్ఎస్ వైపు ఆకర్షించిందన్నారు.
బీఆర్ఎస్‌లో యువతను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇకపైన సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి పార్టీ మీటింగ్‌లు మండల స్థాయి నుంచి ఏర్పాటు చేసుకుందామని సర్దిచెప్పారు. పార్టీలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ వరకు అన్ని రకాల భావజాలాల కలిగినవారు ఉన్నారని తెలిపారు. సన్నాహక సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా కేసీఆరే పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహిస్తారని, పార్టీ పునర్ వ్యవస్థీకరణపై నిర్ణయాలు ప్రకటిస్తారని తెలిపారు.