BRS: భవిష్యత్తుకు భరోసా ఏదీ..? బీఆర్ఎస్ కేడర్‌లో అయోమయం
బీఆర్ఎస్ పార్టీలో కేడర్ కు భరోసా కల్పించేవారే కరువయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో కేడర్ కు భరోసా కల్పించేవారే కరువయ్యారు. వారిని కలిసేవారు లేక.. సమస్యలను వినేవారు సైతం లేకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. పార్టీని ఎవరుగాడిలో పెడతారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధానపార్టీలు యాక్టీవ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తుండగా, బీఆర్ఎస్ పార్టీలో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అసలు పార్టీలో కొనసాగాలా? లేక పార్టీ మారాలా? అనే ఆలోచనలో కేడర్ సతమతమవుతున్నారు. కనీసం వారిలో భరోసా కల్పించాల్సిన పార్టీ అధిష్టానం స్తబ్దుగా ఉండటంతో ఏం చేయాలో తెలియడం లేదని కిందిస్థాయి నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు.
ఓటమిపై సమీక్షించని అధినేత
పార్టీ అధినేత కేసీఆర్ ఫాం హౌజ్ కు మాత్రమే పరిమితం అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో కేడర్ కు అందుబాటులో ఉంటారని, పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని పార్టీ లీకులు సైతం ఇచ్చింది. కానీ ఆచరణకు మాత్రం ఇప్పటివరకు నోచలేదు. పార్టీ నాయకులతో సమీక్షలు లేవు. ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఇప్పటి వరకూ సమీక్ష నిర్వహించకపోవడంపై కేడర్ తీవ్ర నైరాశ్యానికి గురవుతున్నారు. అసెంబ్లీ, పార్ల మెంట్ ఓటమికన్నా పార్టీపై అధినేత ఫోకస్ పెట్టకపోవడమే మరింత కుంగదీస్తుందని ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితం
మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కేడర్ కు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణ భవన్ లో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు పార్టీ కేడర్ కు, నేతలకు అందుబాటులో ఉంటానని గత నెల 27న ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటికీ కేటీఆర్ వ్యాఖ్యలు అమలుకు నోచడం లేదు. పార్టీ యువలీడర్ అని పేర్కొంటున్నా.. యువతకు అందుబాటులో ఉండకపోవడం.. ఆయన భవిష్యత్ లో పార్టీని ఎలా నడిపిస్తారంటూ పార్టీ నాయకు లే పెదవి విరుస్తున్నారు. కేటీఆర్ చెప్పేది ఒకటి... చేసేది మరొకటి అంటూ సొంతపార్టీ నేతలే విమర్శలకు పదును పెడుతున్నారు.
స్తంభించిన పార్టీ కార్యక్రమాలు..
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేసిన దాఖలాలు లేవు. కేవలం అసెంబ్లీ వేదికగా మాత్రమే ప్రస్తావించారు. వాటిని గ్రామస్థాయిలో తీసుకెళ్లడంలో మాత్రం వెనుకబడి ఉన్నారని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ప్రభుత్వంపై యాక్టీవ్ కార్యక్రమాలను నిర్వహిస్తే గత బీఆర్ఎస్ పాలనలో చేసిన అక్రమాలను వెలికి తీస్తుందనే భయంతోనా? లేకుంటే మరోకారణం ఏమైనా ఉందా? అని సర్వ త్రా చర్చనీయాంశమైంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలోనైనా పార్టీ యాక్టీవిటీస్ ను ముమ్మరం చేస్తుందా? లేదా? అనేది చూడాలి.