'బడ్జెట్ అనుమతి కోసం కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది'
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సిన పరిస్థితి వచ్చిందని ఇలాంటి సిట్యుయేషన్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సిన పరిస్థితి వచ్చిందని ఇలాంటి సిట్యుయేషన్ గతంలో ఎన్నడూ ఎదురు కాలేదని బీఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ నేత కె. కేశవరావు అన్నారు. బడ్జెట్ కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్ లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సోమవారం కేంద్రం నిర్వహిచిన అఖిలపక్ష సమావేశానికి నామా నాగేశ్వరరావుతో పాటు కేకే హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ తెలంగాణతో పాటు ఢిల్లీ,తమిళనాడు, కేరళ ఇతర అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థతో ఇబ్బందులు ఉన్నాయని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమాఖ్య వ్యవస్థ,ఫెడరలిజం గురించి చర్చ జరగాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయలేనందున గవర్నర్ ప్రసంగం లేదని చెప్పారు. గవర్నర్ ప్రసంగం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో అభ్యంతరాలు ఉంటే కూర్చుని మాట్లాడాలన్నారు. పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగం బహిష్కణపై ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నిర్ణయం తీసుకున్నాక తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు.
ప్రజా సమస్యలపై చర్చ జరపాలి:
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు లేవనెత్తుతామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. కేవలం బిల్లుల ఆమోదం కాకుండా ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని చెప్పారు. రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు, నిరుద్యోగం, దేశ సమస్యలతో పాటు గవర్నర్ వ్యవస్థపై చర్చ జరపాలని కోరినట్టు తెలిపారు.