రాహుల్ గాంధీవి నీతులు.. రేవంత్ రెడ్డివి గోతులు: BRS

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

Update: 2024-04-11 16:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ అభద్రతా భావంతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌తో కొడంగల్ ఓటర్లను బెదిరిస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధిద్దామని, విలువలను కాపాడుకుందామని, ప్రజాస్వామ్య యుతంగా పాలన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేవిధంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు వెళ్తే స్పీకర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. స్పీకర్ నిష్పక్ష పాతంగా ఉండాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నించామని, స్పీకర్ టైమ్ ఇవ్వక పోవడంతో రిజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపామని, మెయిల్ ద్వారా కూడా పంపినట్లు తెలిపారు. దానంతో పాటు కడియం, తెల్లంల పై అనర్హత వేటు వేయడం మినహా స్పీకర్‌కు వేరే మార్గం లేదన్నారు. మహారాష్ట్రలో కూడా పార్టీమారిన ఎమ్మెల్యేలపై 3నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందని, హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అక్కడ పార్టీ పిరాయించిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే బీఆర్ఎస్ ఎంత వరకైనా పోరాడుతుందన్నారు.

అసెంబ్లీ ఎదుటదీక్షలు, ఎమ్మెల్యే ఇళ్ల ముందు ధర్నా చేస్తామని, కోర్టుల తలుపు తడుతామని స్పష్టం చేశారు. సీఎం వైఖరీని ప్రజలు గమనిస్తున్నారన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ను బలహీన పర్చేలా కాంగ్రెస్ తుక్కుగూడ మేనిఫెస్టో ఉందన్నారు. పార్టీ పిరాయిస్తున్న ఎమ్మెల్యేలనా.. ప్రోత్సహిస్తున్న సీఎంనా ఎవరిని రాళ్లతో కొట్టాలని రేవంత్ ను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నీతులు చెబుతారు ..రేవంత్ గోతులు తవ్వుతారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతితో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ అంటూనే కన్య్ఫూజన్ పార్టీ, కరప్షన్ పార్టీ అని దుయ్యబట్టారు. తుక్కు గూడ సభలో మేనిఫెస్టో విడుదల చెస్తూ ఆదే వేదిక మీద పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూర్చొ బెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. స్పీకర్ పై సీఎం ఒత్తిడి చేయడం ఆపాలన్నారు. 

Tags:    

Similar News