బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్.. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్!

బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Update: 2024-07-13 02:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్న నలుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీని సైతం గెల్చుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న స్థానాలనూ కోల్పోనున్నది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య నాలుగుకు పడిపోయింది. జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం ముగియడంతో ఆ రెండూ కాంగ్రెస్ వశమయ్యాయి. కేశవరావు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నా కాంగ్రెస్‌లో చేరి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మిగిలిన నలుగురు ఉంటారా?.. ఉండరా? అనే చర్చ పొలిటికల్‌గా వైరల్ అవుతున్నది.

టీడీపీ తరహా ఫార్ములా రిపీట్

గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు ఆ పార్టీని విడిచి బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైనట్లయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితీ అదే తీరులో రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కారు పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీవైపు చూస్తున్నారంటూ ఢిల్లీలోని కమలనాథులు అనధికారికంగా ధ్రువీకరిస్తున్నారు. తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఆరు రోజుల పాటు అక్కడే ఉండి బీజేపీ నేతలతో చర్చలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో తొలుత బీఆర్ఎస్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలనే అవగాహన కుదిరినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎంపీలను పార్టీ అధిష్టానమే పంపుతున్నదని ఢిల్లీలోని బీజేపీ వర్గాల సమాచారం.

పకడ్బందీ వ్యూహం ప్రకారమే..

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తరహాలో రాజ్యసభ ఎంపీలు సైతం పార్టీని విడిచి పెట్టి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు తొలుత వచ్చాయి. కానీ కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీ టూర్‌ను గమనంలోకి తీసుకున్న తర్వాత పకడ్బందీ వ్యూహం ప్రకారమే గులాబీ బాస్ ఈ దిశగా పావులు కదుపుతున్నారనే సందేహాలు బలపడ్డాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సైతం సన్నిహితులతో చర్చించారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే భారీ వ్యూహంలో తొలి ప్రయత్నంగా రాజ్యసభాపక్షాన్ని తొలుత మెర్జ్ చేస్తున్నారంటూ పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి ఓపెన్‌గానే వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా మరిన్ని పరిణామాలు ఉంటాయని, అందులో ఒకటి ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్‌పై బయటికి రావడం అని పేర్కొన్నారు.

సంఖ్యాబలం పెంచుకోవడం బీజేపీకి అవసరం

రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ (మొత్తం సంఖ్యలో సగం మంది) లేకపోవడంతో అనివార్యంగా ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్నది. ఆ పార్టీకి 90 మంది సభ్యులుండగా ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకున్నా 125కు చేరడంలేదు. దీంతో సంఖ్యాబలాన్ని పెంచుకోవడం ఆ పార్టీకి అవసరంగా మారింది. కీలకమైన బిల్లుల ఆమోదానికి తగినంత మంది సభ్యులు లేకపోవడంతో చిక్కులు వస్తాయన్న దూరదృష్టితో తనదైన శైలిలో బీజేపీ పావులు కదుపుతున్నది. అదే సమయంలో బీఆర్ఎస్‌కు సైతం కొన్ని అవసరాలు కేంద్రంలోని అధికార పార్టీతో తీర్చుకోవాలని భావిస్తున్నది. నలుగురు ఎంపీలను బీజేపీకి పంపిస్తే కష్టకాలంలో బీజేపీ నుంచి సాయం అందుతుందనేది దీని వెనక ఉన్న ఉద్దేశమనే మాటలు గులాబీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపే..

కేటీఆర్, హరీశ్‌రావ్ ఢిల్లీ టూర్ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి అవగాహన కుదిరిందనేది బహిర్గతం కాకపోయినా రాజ్యసభా పక్షాన్ని విలీనం చేయాలనే స్పష్టత వచ్చిందనేది ఢిల్లీ కమలనాథులు నర్మగర్భంగా చెబుతున్న మాట. అయితే నలుగురిలో ముగ్గురు మాత్రమే వెళ్తారని, ఒకరు బీఆర్ఎస్ ఎంపీగానే కొనసాగుతారనే మాట వినిపిస్తున్నది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపే విలీనం ప్రాసెస్ కంప్లీట్ అవుతుందనేది ఆ మాటల వెనక మర్మం. రెండు రోజులుగా ఢిల్లీ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ‘ఇది నిజమేనేమో’.. అంటూ ఆ పార్టీ నేతల మధ్యనే గుసగుసలు మొదలయ్యాయి.


Similar News