బీఆర్ఎస్ నేతలు రహస్యంగా ర్యాలీలో దూరి.. విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్..

గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా శనివారం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ అశోక్ నగర్ లో నిరసనలో పాల్గొన్నారు.

Update: 2024-10-19 12:26 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా శనివారం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ అశోక్ నగర్ లో నిరసనలో పాల్గొన్నారు. శుక్రవారం నిరుద్యోగలుపై జరిగిన లాఠీ ఛార్జ్, జీవో నెంబర్ 29 కి వ్యతిరేకంగా నిరసనలో బండి పాల్గొనడంతో, బీజేపీ కార్యకర్తలు, ఎబీవీపీ, ఇతర అనుబంధ సంస్థల సభ్యులు వేల సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ప్రయత్నించగా ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఏదో కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. దీంతో గ్రూప్-1 అభ్యర్థుల ర్యాలీని రెండుగా చీల్చేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. అదే సమయంలో చలో సెక్రటెరియట్‌కు బండి పిలుపునిచ్చి, గ్రూప్ -1 అభ్యర్థులతో పయనమయ్యారు. ఆయన్ను.. పోలీసులు ట్యాంక్ బండ్ వద్ద అడ్డుకొని.. అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి తరలించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండిని వదిలిపెట్టారు.

ఇదే విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థుల బాగు కోసం తాను నిరసనలో పాల్గొంటే.. బీఆర్ఎస్ దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిందని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు. అలాగే ఈ రోజు బీఆర్ఎస్ భారీ కుట్ర పన్ని.. మా ర్యాలీలో చొరబడి విధ్యంసం చేసేందుకు ప్రయత్నించిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ కుట్రలో భాగంగానే ఏం తెలియనట్టు ర్యాలీలో పాల్గొనే ప్రయత్నం చేసి.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూశారని.. ఇది గమనించిన యువత.. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారని.. కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.


Similar News