Ex Minister: కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అల్లకల్లోలమే

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అల్లకల్లోలమేనని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-13 15:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అల్లకల్లోలమేనని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్‌కు 60 లక్షల మంది కార్యకర్తల సైన్యం ఉందని అందర్నీ జైల్లో వేస్తారా అంటూ ప్రశ్నించారు. మేం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని ప్రకటించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేస్తామంటూ రేవంత్ ప్రభుత్వం గత రెండు నెలలుగా పుకార్లను వ్యాప్తి చేస్తోందన్నారు. ఫార్ములా కార్ల రేసింగ్‌కు సంబంధించి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ ఏసీబీకి అనుమతించారనే వార్తలు వస్తున్నాయని, కేటీఆర్ ఏం తప్పు చేశారని అరెస్టు చేస్తారన్నారు. ప్రపంచంలో ప్రముఖ నగరాలకు పరిమితమైన ఫార్ములా కార్ల రేసింగ్‌ను హైదరాబాద్‌కు తేవడమే కేటీఆర్ చేసిన తప్పా అని ప్రశ్నించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడమే కేటీఆర్ చేసిన తప్పా అంటూ ధ్వజమెత్తారు.

ఫార్మూలా కార్ల రేసింగ్ ఈవెంట్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని, హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని అనేక సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నాయన్నారు. పారిశ్రామిక, ఉపాధి రంగానికి ఊతమిచ్చే ఫార్ములా కార్ల రేసింగ్‌ను కొనసాగించకుండా రద్దు చేయడమే రేవంత్ ప్రభుత్వం చేసిన తప్పు.. ఫార్ములా ఈ సంస్థను ప్రోత్సహించేలా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం తప్పు కాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయడానికి రాష్ట్రంలో ఏమైనా రాచరిక పాలన నడుస్తోందా..? బీఆర్ఎస్ పాలించిన పదేళ్ల కాలంలో పాత పథకాలను రద్దు చేయకుండా కొనసాగించిందన్నారు.రాష్ట్రంలో పాలన గాలికి పోయిందని, ప్రశ్నించిన ప్రతి ఒక్కర్ని జైలుకు పంపాలని రేవంత్ కంకణం కట్టుకున్నారని, తాను జైలుకు వెళ్లినందున కేటీఆర్ కూడా జైల్లో ఉండాలని రేవంత్ కుట్రలకు తెర లేపారన్నారు.

Tags:    

Similar News