మంత్రుల తీరుపై BRS శ్రేణుల విస్మయం.. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితపై అసంతృప్తి!

వ్యవసాయరంగంపై కేంద్రం వివక్ష పూరిత ధోరణి అవలంభిస్తుందని ఆరోపిస్తూ నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపు నిచ్చింది.

Update: 2022-12-23 23:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయరంగంపై కేంద్రం వివక్ష పూరిత ధోరణి అవలంభిస్తుందని ఆరోపిస్తూ నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపు నిచ్చింది. రైతులు, పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు నిచ్చారు. అయితే ఆయన నిరసనలో పాల్గొనలేదు. అంతేకాదు మంత్రిహరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత సైతం ఆబ్సెంట్ అయ్యారు. కేబినెట్ మంత్రులంతా హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఇదేం నీతిఅంటూ పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయకల్లాలను ఉపాధిహామీ పథకం నిధులు రూ.150కోట్లతో నిర్మిస్తే ఈ నిధులను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు ఇచ్చిందని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంటూ శుక్రవారం అన్ని జిల్లా కేంద్రంలో రైతు నిరసనలు చేపట్టింది. కేంద్రానికి రైతులమీద ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసనలో రైతులు, పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కానీ కేటీఆర్ మాత్రం ఎక్కడా నిరసనలో పాల్గొనలేదు. అంతేకాదు.. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రులు సైతం పాల్గొనలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న ఈ వివక్షపూరిత వ్యతిరేక వైఖరిని నిరసనలతో ఎండగడతామని చెప్పినప్పటికీ కీలక నేతలు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈడీ, ఐటీ, సీబీఐ దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతోనే రైతు నిరసనలో పాల్గొనలేదా అనే విమర్శలొస్తున్నాయి. పార్టీ కేడర్‌లోనూ ఇదే అంశంపై చర్చజరుగుతోంది.

రాష్ట్రంలో బీజేపీ కేంద్రనాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. పార్టీ కార్యక్రమాలను యాక్టీవ్ చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. దీనికితోడు బీఆర్ఎస్ పార్టీ నేతలు మనీలాండరీంగ్ తోపాటు పలుస్కాంలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. మూకుమ్మడి సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్... పార్టీ కేడర్ దృష్టిని మరల్చడానికే వ్యవసాయ కల్లాల నిర్మాణం డబ్బులను తిరిగి కేంద్రం చెల్లించాలని నోటీసులు ఇచ్చిందని నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే నోటీసును మాత్రం పార్టీ అధిష్టానం గోప్యంగా ఉంచింది. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం... కేంద్రం ఇచ్చిన నోటీసుపై ఎందుకు గట్టిగా గళం వినిపించడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ అంశాన్ని ఎందుకు ఎంపీలు ప్రస్తావించడం లేదని... ఇందులో ఏదో మతలబు ఉందని పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

రైతు నిరసనలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, నేతలు, రైతుసంఘం నేతలు హాజరయ్యారు. మంత్రులంతా ఆయా జిల్లాల్లోనే ఉన్నప్పటికీ నిరసనలో పాల్గొనలేదు. పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇవ్వకనా? లేకుంటే కావాలనే దూరంగా ఉన్నారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అంటే మంత్రులకు రైతు సమస్యలు పట్టవా? లేకుంటే రైతులు కాకపోవడంతోనే పాల్గొనలేదా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు నిరసనలో మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పన్నుల ప్రభుత్వం మోడీది.. పనుల ప్రభుత్వం కేసీఆర్ ది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఉంటుందని ప్రకటనలు చేస్తున్నప్పటకీ ఆచరణలో మాత్రం భిన్నంగా ఉంది. కేవలం కిందస్థాయి కేడర్ కు మాత్రమే పార్టీ ఆదేశాలు వర్తిస్తాయా? నేతలకు కాదా? అనేది పార్టీలో హాట్ టాఫిక్. ఇదిలా ఉంటే ఈ నిరసనలు కేవలం పార్టీ సమావేశాల్లాగానే మారిపోయాయని, తెలంగాణ చేపడుతున్న రైతు పథకాల గురించి ప్రస్తావించారని, కేసీఆర్ పొగడటమే నేతలవంతు అయిందని పలువురు రైతులు, రైతుసంఘాల నేతలు పెదవి విరిచారు.

Also Read..

వైఎస్ జగన్, షర్మిల మధ్య పెరిగిన గ్యాప్.. ఇదిగో సాక్ష్యం ..? 

Tags:    

Similar News