ఈటలకు షాక్.. లోకాయుక్తలో ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్..!

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు అందింది.

Update: 2023-07-18 08:20 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. జీఓ నెంబర్ 58, 59లను అడ్డం పెట్టుకొని ఈటల తన అనుచరులకు జమ్మికుంట పట్టణంలోని 629, 887 సర్వే నెంబర్లలో దాదాపు 5 ఎకరాల భూమిని కట్టబెట్టినట్టుగా అందులో పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పైరవీతో ప్రస్తుతం మున్సిపల్ అధికారులు ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకున్నా ఇంటి నెంబర్లు కేటాయించినట్టుగా వివరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి, జమ్మికుంట అర్బన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరు రాజకుమార్ లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేశారు.

నిజానికి 2014లో ప్రభుత్వం 125 గజాలలోపు ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించాలని 58, 59 నెంబర్ల జీవోలు జారీ చేసినట్టు తెలిపారు. వీటిని అడ్డం పెట్టుకొని రెవిన్యూ అధికారుల మీద ఒత్తిడి తేవటంతోపాటు డబ్బు ఆశ చూపించి ఈటల అనుచరులు 500, 1000, 1500 గజాల చొప్పున మొత్తం 5 ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. 2004 నుంచి 2023 వరకు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా, 2014 నుంచి 2021 వరకు మంత్రిగా ఈటల ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. ఆ సమయంలో ఆయన ఎంఎల్ఏ అసైన్డ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే ప్రభుత్వ జీవోలను అడ్డం పెట్టుకొని ఈటల కోట్ల రూపాయల విలువ చేసే భూములను తన అనుచరులుకు దక్కేలా చేశారని వివరించారు.

పాత రెవిన్యూ అధికారుల సంతకాలతో పేదలకు చెందాల్సిన భూములను ఈటల అనుచరులు కబ్జా చేసినట్టు పేర్కొన్నారు. అవినీతికి మరిగిన కొందరు ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, మున్సిపల్ అధికారులు వీరికి సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికీ పేదల కోసం ఒక్క వైకుంఠ ధామం సరిగ్గా లేదని, ఈటల అనుచరులకు మాత్రం వేల గజాల భూములు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా ఇంటి నెంబర్లు కేటాయింపు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈటల తన అనుచరుల కబ్జాలో ఉన్న భూములకు విముక్తి కల్పించి పేదలకు అందేలా చూడాలన్నారు. దీని కోసమే లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.

Tags:    

Similar News