BRS నేతలకు కొత్త తలనొప్పి.. ఆ విషయంలో ఏం మాట్లాడాలో తెలియక అయోమయం!
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు వెళ్లకుండా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నాల పట్ల సొంత పార్టీ లీడర్లు పెదవి విరుస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు వెళ్లకుండా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నాల పట్ల సొంత పార్టీ లీడర్లు పెదవి విరుస్తున్నారు. తప్పు చేయనప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లడం ఎందుకని అభిప్రాయపడుతున్నారు. ఏ విచారణకైనా సిద్ధమని గతంలో చెప్పి, ఇప్పుడు తప్పించుకోవడం ఎందుకని ఇంటర్నల్ మీటింగ్స్‌లో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని బయటికి చెప్పే ధైర్యం ఎవరికీ లేదని, ఎవరైనా నోరు విప్పితే పెద్దసారు ఆగ్రహానికి గురవుతామని జంకుతున్నారు.
పార్టీ బ్లేమ్ అవుతున్నదని ఆందోళన
ఈడీ విచారణ విషయంలో కవిత సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ప్రజల్లో బ్లేమ్ అవుతున్నామని పార్టీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. ఈడీ పిలిచిన వెంటనే కవిత విచారణకు వెళ్లి ఉంటే ప్రజల్లో సానుభూతి వచ్చేదని అంటున్నారు. అలా కాకుండా విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడం, హైదరాబాద్ లోనే విచారణకు చాన్స్ ఇవ్వాలని అడగడం చూస్తుంటే కవిత తప్పు చేశారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని భావిస్తున్నారు. కవిత ఎపిడోస్ తో పార్టీకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదముందని అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.
సమర్థించలేక డైలమా..
బీఆర్ఎస్‌ను వీక్ చేసేందుకు కేంద్రం తన దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని మొన్నటివరకు గులాబీ లీడర్లు వరుసగా ప్రెస్ మీట్స్ పెట్టి ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తున్నందుకే విచారణ పేరుతో తమను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కానీ ప్రస్తుతం ఈడీ విచారణకు వెళ్లకుండా కవిత చేస్తున్న ప్రయత్నాలను చూసి బీఆర్ఎస్ లీడర్లు ఖంగుతింటున్నారు. లిక్కర్ కేసుతో సంబంధం లేకుండా ఉంటే ధైర్యంగా విచారణకు వెళ్లొచ్చు కదా?అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై మీడియా ప్రశ్నించినప్పుడు కవితను ఎలా సపోర్ట్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కేసు సుప్రీం విచారణలో ఉన్నందును ప్రస్తుతం కామెంట్ చేయడం సరికాదని తప్పించుకుంటున్నారు.