సీఎం కేసీఆర్‌కు ‘డబుల్ స్ట్రోక్’.. ఎన్నికల వేళ గులాబీ బాస్‌కు ఊహించని షాక్‌లు..!

హాట్రిక్ గెలుపుపై కన్నేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో గులాబీ బాస్‌కు మొదలైన వరుస ఎదురు దెబ్బలు ఇప్పటికీ

Update: 2023-10-18 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: హ్యాట్రిక్ గెలుపుపై కన్నేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో గులాబీ బాస్‌కు మొదలైన వరుస ఎదురు దెబ్బలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. సౌత్ ఇండియాలో హాట్రిక్ సీఎంగా రికార్డ్ క్రియేట్ చేయాలని చూస్తోన్న కేసీఆర్‌కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో కారు పార్టీ డ్యామేజ్ అవ్వడం మొదలైంది. టికెట్ దక్కని నేతలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నేతలు వరుసగా గులాబీ పార్టీని వీడుతున్నారు. ఇలా వరుస షాకులతో సతమతమవుతోన్న గులాబీ పార్టీకి మరో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఈ సారి ఏకంగా సీఎం కేసీఆర్ సొంత ఇలాకా గజ్వేల్‌తో పాటు.. ఈ ఎన్నికల్లో గులాబీ బాస్ బరిలోకి దిగనున్న మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో బీఆర్ఎస్‌కు సొంత పార్టీ నేతలే షాకిస్తున్నారు. ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయమే ఉన్న తరుణంలో సీఎం కేసీఆర్ పోటీ చేసే నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలు అంసృప్తి వ్యక్తం చేయడం బీఆర్ఎస్‌తో పాటు స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈటలకు మద్దతిస్తాం..!

సీఎం కేసీఆర్ సొంత ఇలాకా గజ్వేల్‌లో గులాబీ బాస్‌కు ఊహించని షాక్ తగిలింది. గజ్వేల్‌లోని బీఆర్ఎస్ అసమ్మతి నేతలంతా బుధవారంలో ఓ ఫంక్షన్ హాల్‌లో భేటీ అయ్యారు. గత కొంత కాలంగా అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న నేతలు అంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. గత కొంత కాలంగా పార్టీలో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని.. అసలు పార్టీలో గుర్తింపు దక్కడం లేదని అసమ్మతి నేతలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వేల్ పోటీ చేస్తే ఆయన మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ అసమ్మతి నేతలు భేటీ అయ్యి.. ఈటల రాజేందర్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ అధిష్టానం అసంతృప్తి నేతలను ఏ విధంగా బుజ్జిగిస్తుందో చూడాలి.

పార్టీలో గుర్తింపు లేదు..!

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కేసీఆర్ కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. స్థానిక నేతలను సమన్వయం చేస్తూ కేసీఆర్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యుహాలను వారికి వివరిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ ఇవాళ కామారెడ్డి ముఖ్య నేతలతో మీటింగ్ నిర్వహిస్తున్నారు. తొలుత ఈ సమావేశం కామారెడ్డిలో నిర్వహించాల్సి ఉండగా.. చివరి క్షణాల్లో ప్రగతి భవన్‌కు షిఫ్ట్ అయ్యింది. అయితే, ఈ సమావేశానికి తమను ఆహ్వనించలేదని 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు అలకబూనారు. అందులో కొందరు నేడు జిల్లా కేంద్రంలోని ఓ గెస్ట్ హౌస్‌లో రహస్యంగా భేటీ అయ్యారు.

పార్టీ కౌన్సిలర్లుగా తమకు విలువ లేకుండా పోతుందని, అసలు గుర్తింపే దక్కడం లేదని.. ప్రజల ఓట్లతో గెలిచిన తమకు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాకు లీక్ చేశారు. సీఎం పోటీ చేయనున్న నియోజకవర్గంలో సొంత పార్టీ కౌన్సిలర్ల అసమ్మతి గళం విప్పడం చర్చనీయాశంగా మారింది. హాట్రిక్ గెలుపు సాధించాలని చూస్తోన్న బీఆర్ఎస్‌కు.. పార్టీ అధినేత పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేయడం గులాబీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం గులాబీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News