నీట్ వ్యవహారంపై కేంద్రానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ బహిరంగ లేఖ!
కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. నీట్ పరీక్ష వ్యవహారం పై స్పందించిన ఆయన నిందితులను శిక్షించాలని కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహస్తోందని, ఇంత జరుగుతున్న మోడీ సర్కార్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతీసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
అసలు ఈ వ్యవహారం పై విచారణకు ఆదేశించకపోగా, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. లక్షల మంది విద్యార్థులు ఫిర్యాదు చేసిన స్పందించలేదని, సుప్రీంకోర్టులో కేసు వేసినా ఒక్క వివరణ కూడా ఇవ్వలేదని, కానీ ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్టీఏ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందన్నారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాకింగ్ నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతున్నారని ఆరోపించారు.
ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నీట్ ఎగ్జామ్ ను పెద్దసంఖ్యలో విద్యార్థులు రాశారని, నీట్ లో వివాదాల కారణంగా తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు ఎన్డీఏ సర్కారుపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇందులో ఎన్టీఏ పాత్ర పై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితోపాటు అక్రమంగా లబ్దిపొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.. దీంతో ఎన్టీఏ పై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. నీట్ లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా అసలు ఊరుకునే ప్రసక్తే లేదని, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు.