BRS: కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి విషయంలో బీఆర్ఎస్ సీరియస్..! నేడు కేసీఆర్‌తో హరీశ్‌రావు, కౌశిక్ భేటీ?

ఒక ఎమ్మెల్యే ఇంటి వద్దకు మరో ఎమ్మెల్యే అనుచరులు వెళ్లి దాడి చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-09-13 02:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక ఎమ్మెల్యే ఇంటి వద్దకు మరో ఎమ్మెల్యే అనుచరులు వెళ్లి దాడి చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి అనుచులు వెళ్లి దాడి చేసిన అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకున్నది. ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నది. అందులో భాగంగానే శుక్రవారం ఫాం హౌజ్ లో పార్టీ అధినేత కేసీఆర్ తో ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో వీరంతా సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. అంతేగాకుండా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలోనూ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిసింది. పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడేలా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనేదానిపైనా చర్చించే అవకాశం ఉంది. అంతేగాకుండా అరికెపూడిపై నమోదైన కేసులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి ఏవిధంగా పోరాటం సాగించాలనేది విషయంలో కూడా పలు సూచనలు చేసే అవకాశం ఉందని సమాచారం.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా..

ఎమ్మెల్యే ఇంటిపై దాడి విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ సైతం సీరియస్ గా తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. స్పీకర్, గవర్నర్ ను సైతం కలిసి విజ్ఞప్తులు చేయాలని, అదే విధంగా హైకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడేనని, దాడిపై సీబీఐ విచారణ కోరడంతోపాటు కేంద్ర హోంశాఖ వద్దకు వెళ్తామని ఎమ్మెల్యే హరీశ్ రావు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎలాంటి కార్యచరణతో ముందుకు వెళ్తారనేది త్వరలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా ఒత్తిడి పెంచడంతోపాటు దాడి బాధ్యులపై చర్యలు తీసుకునేలా పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నాకు పిలుపు ఇవ్వబోతున్నట్లు సమాచారం. తేదీని కూడా పార్టీ ఫిక్స్ చేయబోతున్నట్లు గులాబీ నేతల ద్వారా తెలిసింది.

స్థానిక ఎన్నికల్లో ప్రచారాంశం

స్థానిక ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా చేరికల అంశాన్ని చేసుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే విధంగా ప్రశ్నించేవారిపై దాడులు చేస్తున్నారని, ఇప్పటికే నేతలపై పెట్టిన కేసులు, సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెడితే కాంగ్రెస్ వ్యవహరించే తీరును ఎండగట్టాలని భావిస్తున్నది. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మోసాలు, గారడీలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యం తీసుకువస్తామని పార్టీ నేతలు తెలిపారు. అయితే కేసీఆర్ తో జరిగే చర్చల్లో ఏయే అంశాలపై నిర్ణయం తీసుకుంటారనేది పార్టీలో చర్చనీయాంశమైంది.


Similar News