మరో ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం!

కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను ఆదుకోకపోతే చలో సచివాలయం పిలుపుని స్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు వెల్లడించారు. మరో ప్రజా ఉద్యమానికి బీఆర్‌ఎస్ త్వరలో శ్రీకారం చూట్టబోతున్నామని ప్రకటించారు.

Update: 2024-03-24 12:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను ఆదుకోకపోతే చలో సచివాలయం పిలుపుని స్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు వెల్లడించారు. మరో ప్రజా ఉద్యమానికి బీఆర్‌ఎస్ త్వరలో శ్రీకారం చూట్టబోతున్నామని ప్రకటించారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతాబాయి తండాలో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో నీళ్లు రాక బోర్లకు నీళ్లు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు హరీశ్ రావు తో ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలను చూపి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడు నెలల్లో శివ శంకర్ అనే రైతు 6 బోర్లు, సత్యమ్మ 4 బోర్లు, నరసింహ 3 బోర్లు, జంకు 9 బోర్లు, లక్ష్మి 6 బోర్లు, విజయ 4 బోర్లు వేసినా నీళ్లు పడలేదని వివరించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఒక్కోరైతు నాలుగైదు బోర్లు వేసి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.

రైతులకు నీరు అందించలేక చేతులెత్తేసింది

గోదావరి నదిలో నీళ్ళు ఉన్నప్పటికి ప్రభుత్వం రైతులకు నీరు అందించలేక చేతులెత్తేసిందని ఫైర్ అయ్యారు. ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, రైతులను, రైతు కూలీలను, కౌలు రైతులను మోసం చేసిందని ఆరోపించారు. 2 లక్షల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి వంద రోజులు దాటినా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుందని తెలిపారు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు.

25 వేల నష్టపరిహారం చెల్లించాలి

ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి వాళ్లింటికి వెళ్తున్నారని, కానీ రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లడం లేదని విమర్శించారు. నీళ్లందించడం విఫలమైన ప్రభుత్వం రైతుకు వెంటనే ఎకరానికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీ ప్రకారం వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేశారు. బోనస్ ఇవ్వకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్‌కు లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఆదుకోకపోతే భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అవసరమైతే రైతులతో చలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News