బిగ్ న్యూస్: ఇతర రాష్ట్రాల్లో పోటీకి BRS సై.. నేషనల్ పాలిటిక్స్‌ టార్గెట్‌గా కేసీఆర్ మాస్టర్ ప్లాన్!

ఇతర రాష్ట్రాల్లో పోటీకి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల్లో, కర్నాటకలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తుంది.

Update: 2023-03-23 00:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇతర రాష్ట్రాల్లో పోటీకి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల్లో, కర్నాటకలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇన్ చార్జులుగా ఎవరిని నియమించాలనేదానిపైనా ఇప్పటికే కేసీఆర్ పలువురితో చర్చించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో సత్తాచాటేందుకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. పోటీ చేసి విజయం సాధించాలని, ఆ విజయంతోనే ముందుకువెళ్లాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. మహారాష్ట్రలోని కాందార్‌లోహ సభలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అడుగులు వేస్తుంది. తొలుత కర్ణాటక, మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తుంది. కర్నాటకలో తెలుగువారు ఉండటంతో, తాజా రాజకీయాల నేపథ్యంలో అక్కడ పోటీ చేయాలని భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ నేత కుమారస్వామితో కలిసి బరిలోకి దిగాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. మొదటి అడుగుతో సత్తా చాటాలని చూస్తుంది. జేడీఎస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని, ఇప్పటికే కుమారస్వామిని సీఎంగా చూడాలని పలుమార్లు కేసీఆర్ ప్రకటనలు చేశారు.

తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రచారం చేస్తామని బహిరంగానే పేర్కొన్నారు. ప్రచారం చేస్తామని వెల్లడించారు. అయితే అనూహ్యంగా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. జేడీఎస్, గులాబీ కండువాతో ప్రచారం చేసి కొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించి ఇతర రాష్ట్రాల్లో ఈ విజయంను వివరించాలని చూస్తున్నారు. ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తారనేది మాత్రం కర్నాటక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ క్లారిటీ ఇస్తారని విశ్వాసనీయ సమాచారం.

మహారాష్ట్రలో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలుగుప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బరిలోకి దిగాలని, అందుకు కసరత్తు కూడా కేసీఆర్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే నాందేడ్ లో సభ నిర్వహించిన కేసీఆర్, ఈ నెల 26న కాందార్ లోహలో రెండో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ఏర్పాటు బాధ్యతలను తెలంగాణ నేతలకే అప్పగించారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రతి రోజూ మహారాష్ట్ర నేతలతో సభ విజయవంతంపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అలర్ట్ చేస్తున్నారు. అంతేకాదు ప్రచార రథాలతో తెలంగాణ సంక్షేమ పథకాలు, తెలంగాణ మోడల్‌ను వివరిస్తున్నారు. ఆ సభలోనే కేసీఆర్ పోటీపై క్లారిటీ ఇవ్వడంతో పాటు ఏ జిల్లాల్లో పోటీ చేస్తామని ప్రకటించే అవకాశం ఉంది. అంతేగాకుండా మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్‌లో చేరేవారికి పార్టీ బాధ్యతలు కూడా అప్పగించనున్నారని నేతలు పేర్కొంటున్నారు.

కర్నాటక, మహారాష్ట్రలో ఎన్నికలకు ఇన్ చార్జి బాధ్యతలు ఎవరికి అప్పగించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. కొంతమంది నేతల ఫర్ఫామెన్స్ సైతం తీసుకున్నట్లు సమాచారం. కేబినెట్‌లోని నలుగురు మంత్రులకు, ఆయా రాష్ట్రాల బార్డర్‌లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ సీనియర్ నేత తెలిపారు. ఈ రెండురాష్ట్రాల్లో విజయం సాధించి రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కానున్నట్లు సమాచారం. ఈ విజయంతో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్‌కు ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారోనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Also Read: తెలంగాణ మళ్లీ దొరల పాలనలోకి..

Tags:    

Similar News