ఫెయిల్ అయితే ఇజ్జత్ పోతదేమో.. నిరసనలకు బీఆర్ఎస్ వెనుకంజ
బీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే జనం వస్తారో.. రారో అర్థంకాక సతమతం అవుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే జనం వస్తారో.. రారో అర్థంకాక సతమతం అవుతున్నది. ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే ఇజ్జత్ పోతుందేమోనని.. కేడర్ సైతం డీ మోరల్ అయ్యే అవకాశం ఉందని ఆందోళన పడుతున్నది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే గుబులు సైతం పట్టుకున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మీడియాకే పరిమితమైతే బెటర్ అనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
సర్కారును ఇరుకున పెట్టాలనే ప్లాన్
ఎలాగైనా రేవంత్ సర్కారును ఇరుకున పెట్టాలని ‘గులాబీ’ నేతలు ప్లాన్ చేస్తున్నారు. హామీల అమలు, ఆరు గ్యారంటీలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్‌కు ప్రజల నుంచి ఆశించిన మేర స్పందన వస్తుందో రాదోననే ఆందోళన బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నది. పిలుపునిచ్చిన తర్వాత ఫెయిల్ అయితే పార్టీ ఇజ్జత్ పోతుందేమోననే మీమాంసలో నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే పిలుపు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. కేవలం ప్రభుత్వం చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తే చాలని, ఎన్నికలకు ఏడాదో, ఆరు నెలల ముందు ప్రజల్లోకి వెళ్దామనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
కేడర్‌ను జమ చేయడం తలకు మించిన భారం
పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పని చేస్తే ఎన్నికల ముందు ఫండింగ్‌కు ఇబ్బంది అవుతుందని అనేక మంది నేతలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అంతే కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఇచ్చే కార్యక్రమాలను విజయవంతం చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని, కేడర్ సేకరణ సైతం తలకు మించిన భారం అవుతుందని.. ఇప్పటికే పలువురు తమ మనసులోని మాటను వ్యక్తం చేస్తున్నారు. ప్రోగ్రామ్ సక్సెస్ కాక పోతే తెలంగాణ సాధించిన పార్టీగా ఇజ్జత్ పోతుందని అందరూ భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వానికి సైతం అస్త్రం ఇచ్చినట్లు అవుతుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
కేడర్ డీ మోరల్ అయ్యే ఛాన్స్!
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఇచ్చే ప్రత్యక్ష కార్యక్రమాలకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోతే కేడర్ డీ మోరల్ అయ్యే అవకాశం లేక పోలేదని, ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తే వారికి సపోర్ట్ ఇచ్చి నిరసనల్లో పాల్గొంటే బాగుంటుందని ఇంకొందరు భావిస్తున్నారు.
కేటీఆర్ పిలుపునిచ్చినా ఫెయిల్
రైతుల సన్నవడ్లకు బోనస్, పంటకు సాగునీరు ఇవ్వాలని, ధాన్యం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రోగ్రామ్స్ ఆశించిన మేర విజయవంతం కాలేదు. రాష్ట్ర గీతం, చిహ్నాల మార్పుపైనా నిరసనలకు పిలుపునిచ్చినా, కేసీఆర్ స్వయంగా చార్మినార్ వద్ద ఆందోళన చేపట్టేందుకు వెళ్లినా కార్యకర్తలు, నాయకులు ఎక్కువ మంది రాలేదు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ నిరసనలు, దిష్టిబొమ్మల దహనానికి పిలుపు నివ్వగా, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే జరిగింది.