బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్.. కాంగ్రెస్‌ను ఓడించాలనే ప్లాన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ వారసత్వంగా రూ. 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణకు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్ వారసత్వంగా రూ. 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణకు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పదేళ్లలో వంద ఏళ్ల విధ్వంసం చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఏనాడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ వంద రోజుల పాలన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. రాష్ట్రంలో డ్రగ్‌మాఫియాపై ఉక్కుపాదం మోపి అణిచివేస్తున్నామన్నారు. ఆరు గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామన్నారు. కులగణన చేయడానికి ఆదేశాలు ఇచ్చామని వంద రోజుల పాలనపై వివరించారు.
మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. వంద రోజుల్లో దాదాపు 75 శాతం పనులు పనిచేశామన్నారు. కానీ వంద రోజుల్లో మేము చేసిన ఒక్కపని బీఆర్ఎస్‌కు కనించలేదా? అని ప్రశ్నించారు. 5 ఏళ్ల వరకు కేసీఆర్ రుణమాఫీ చేయలేదన్నారు. రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మా ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రైతులపై భారం పెరిగింది. మా ప్రాధాన్యత రైతు రుణమాఫీ అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో దుబార ఖర్చులు తగ్గిస్తాం.. అవినీతికి పాల్పడమని హామీ ఇచ్చారు. గాడిద గుడ్డు పెట్టదు.. అలాగే తెలంగాణకు బీజేపీ సర్కార్ ఏమీ ఇవ్వలేదని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఏ శాఖలో ఎన్ని నిధులు ఇచ్చారో.. శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. అయితే బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ అయ్యిందని, ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు.