బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది.. మమ్మల్ని మళ్లీ రెవెన్యూలోకి తీసుకోండి : వీఆర్వో జేఏసీ

రాష్ట్రంలో ఏ ఇతర ఉద్యోగులకు జరగని నష్టం వీఆర్వోలకు జరిగిందని, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా రాత్రికి రాత్రే ఆర్డర్లు ఇచ్చి బెదిరింపులకు గురి చేశారని వీఆర్వోల జేఏసీ ఆరోపించింది.

Update: 2024-07-02 11:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏ ఇతర ఉద్యోగులకు జరగని నష్టం వీఆర్వోలకు జరిగిందని, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా లాటరీ పద్ధతి ద్వారా రాత్రికి రాత్రే ఆర్డర్లు ఇచ్చి, కలెక్టర్లు, ఆర్డీవోలను, డీఆర్వోలను, తహశీల్దార్లు, పోలీసులను ఇంటికి పంపి బెదిరింపులకు గురి చేశారని వీఆర్వోల జేఏసీ ఆరోపించింది. కార్లలో ఎక్కించుకపోయి బలవంతంగా వీఆర్వోలను ఇతర శాఖల్లో పంపారని, అక్కడ వీఆర్వోలు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది వీఆర్వోలకు గత రెండు సంవత్సరాల నుంచి జీతం కూడా రావట్లేదని, చాలా మంది ప్రభుత్వేతర శాఖల్లోకి పంపారన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రజాభవన్​లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డికి వీఆర్వో జేఏసీ మొర పెట్టుకున్నది. వీఆర్వో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్ రావు, అదనపు సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేష్, వైస్ చైర్మన్లు ప్రతిభ, చింతల మురళిలు వినతిపత్రం సమర్పించారు.

ఈ క్రమంలో వారు కోల్పోతున్న బెనిఫిట్స్ గురించి వివరించారు. వీఆర్వోలందరిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం ద్వారానే తమ సమస్యలను పరిష్కారమవుతాయన్నారు. వీఆర్వోలను వివిధ క్యాడర్లలో ఇతర శాఖలోకి పంపడం ద్వారా ఉద్యోగుల సర్వీస్ కు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. సీనియారిటీ, ప్రమోషన్ వంటి అంశాల్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. వీఆర్వోల రద్దు చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో wp no 31725/2022 ద్వారా కేసు వేసి స్టే తీసుకొచ్చినట్లు చెప్పారు. ధరణి వెబ్సైట్ ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాలనను చిన్నాభిన్నం చేసి రెవెన్యూ ఉద్యోగుల మధ్య ప్రజల మధ్య విరోధాలు పెంచారన్నారు. ఈ విషయాలపై తనకు అవగాహన ఉందని చిన్నారెడ్డి వారికి చెప్పారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ అవసరమని, అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే గ్రామ రెవెన్యూ వ్యవస్థ అవసరమని, త్వరలో ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Similar News