ప్రత్యక్ష పోరాటాలకు దూరమైన BRS.. ఫైట్ చేయాల్సిన టైమ్‌లో గప్ చుప్‌గా గులాబీ సైన్యం..!

పోరాడి తెలంగాణ రాష్టాన్ని సాధించామని, రాష్ట్ర అస్తిత్వం తమ పార్టీతోనే సాధ్యమని టైం దొరికినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చే బీఆర్ఎస్..

Update: 2024-06-24 02:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పోరాడి తెలంగాణ రాష్టాన్ని సాధించామని, రాష్ట్ర అస్తిత్వం తమ పార్టీతోనే సాధ్యమని టైం దొరికినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చే బీఆర్ఎస్.. ప్రస్తుతం ప్రత్యక్ష పోరాటాలకు దూరంగా ఉంటున్నదనే విమర్శ ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ నేతలు కేవలం మీడియా ప్రకటనలు, ప్రెస్‌మీట్‌లు, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయంలో పార్టీ పెద్దలు సైలెంట్‌గా ఉండటం కేడర్‌లో చర్చకు దారితీసింది.

నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ విషయంలో కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ సంఘాలు, వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు బొగ్గుగనుల వేలం విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెద్దపల్లిలో బాలికపై లైంగికదాడి, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. వీటిపై పోరాడేందుకు ఇన్ని అవకాశాలు లభించినా.. బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు దిగకుండా, శ్రేణులకు పిలుపునివ్వకుండా సైలెంట్‌గా ఉండటం ఆ పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతున్నది.

ఫెయిల్ అవుతామనే భయమా..?

గ్రామస్థాయి నుంచి పార్టీకి బలమైన కేడర్ ఉన్నదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రత్యక్ష కార్యచరణను చేపట్టేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ పోరాటాలు చేయాలని అధిష్టానం పిలుపునిస్తే అది ఎక్కడ ఫెయిల్ అవుతుందనే భయంతో వెనకడుగు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే ప్రజల్లో పార్టీ ఉనికి కోల్పోవాల్సి వస్తుందేమోనే భయం నేతలను వెంటాడుతున్నదని టాక్. అందుకే కేవలం మీడియా సమావేశాలు, సోషల్ మీడియాను వేదికలుగా చేసుకుని విమర్శలు చేస్తున్నారే తప్ప ప్రత్యక్ష పోరాటాలకు దిగడం లేదని పార్టీ నేతల్లోనే చర్చలు జరుగుతున్నాయి.

‘నీట్’ లీకేజీపై రోడ్డెక్కని గులాబీ సైన్యం

నీట్ పరీక్షా పత్రం లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో సైతం ఎన్ఎస్ యూఐ, ఎస్ఎప్ఐ, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు రొడ్డెక్కాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటిని సైతం ముట్టడించాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సైతం ముట్టడించేందుకు యత్నించాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం విద్యార్థుల పక్షాన నిలబడటంలో విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడితప్ప చెప్పుకోదగిన కార్యక్రమాలను చేపట్టలేకపోయింది.

పేరుకే గొప్పలు..

ప్రతి జిల్లాకూ మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని, వైద్యానికి పెద్దపీట వేశామని, తెలంగాణ విద్యార్థులకు మెడికల్ విద్యను అందుబాటులోకి తెచ్చామని గులాబీ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ విషయంలో వారి పక్షాన పోరాటం చేయడంలో విఫలమైందని పార్టీ కేడర్‌లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బొగ్గు గనుల వేలంపైనా అదే వైఖరి

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ బొగ్గు గనుల వేలం విషయంలోనూ ప్రెస్‌మీట్‌లకే పరిమితమైంది. ప్రస్తుతం శ్రవణ్‌పల్లి బ్లాక్ వేలం పాట కొనసాగుతునప్పటికీ దానిని అడ్డుకోవడంలో వెనకడుగు వేసినట్టు విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, ఆర్‌కే 6 బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 9 రోజుల పాటు నిరసనలు, సమ్మె చేపట్టింది. గతేడాది ఏప్రిల్ 8న సైతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టింది.

కోల్ బెల్టులో మహాధర్నా కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. ఇందులో నేతలంతా పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పార్టీ అనుబంధ కార్మికసంఘం ఘోరంగా పరాజయం పాలైంది. కార్మికసంఘం నేతలు సైతం ఇతర సంఘాల్లోకి వెళ్లారు. దీంతో పార్టీ అనుబంధ సంఘం వీక్‌గా మారింది. ఆ కారణంగానే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు దిగకుండా మీడియా వేదికగా విమర్శలకు మాత్రమే పరిమితమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌తోనే సింగరేణి రక్షణ అంటూ గతంలో పార్టీ నేతలు చేసిన కామెంట్స్‌ను పలువురు గుర్తుచేస్తున్నారు.

పెద్దపల్లిలో చిన్నారిపై లైంగిక దాడి, హత్యపైనా మౌనం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష కార్యచరణ చేపట్టకపోవడం విమర్శలకు దారితీసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఉద్యమకార్యచరణ చేపట్టకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. అసలు గులాబీ పార్టీ తెలంగాణలో ఉన్నదా..? లేదా..? అనే అనుమానం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. పదే పదే 60 లక్షల సభ్యత్వం ఉన్నదని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా.. ప్రజాసమస్యలపై ఎందుకు పోరాడటం చేయడం లేదని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.


Similar News